రణరంగం.. తీవ్ర ఉద్రిక్తత | Altercation between BRS MLAs, MLCs, and police at Assembly | Sakshi
Sakshi News home page

రణరంగం.. తీవ్ర ఉద్రిక్తత

Sep 8 2026 1:45 AM | Updated on Sep 8 2026 1:45 AM

Altercation between BRS MLAs, MLCs, and police at Assembly

సబితను బలవంతంగా లాక్కెళ్తున్న పోలీసులు, టీషర్ట్‌ విప్పి అసెంబ్లీ లోనికి అనుమతించాలంటున్న హరీశ్‌రావు, వాహనంలోకి ఎక్కించడానికి కేటీఆర్‌ను ఎత్తుకెళ్తున్న పోలీసులు

అసెంబ్లీ వద్ద తోపులాట..తీవ్ర ఉద్రిక్తత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య వాగ్వాదం

బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి రావడంతో మెయిన్‌ గేట్‌ వద్దే అడ్డుకున్న పోలీసులు 

అక్కడే బైఠాయించి బీఆర్‌ఎస్‌ నిరసన..నినాదాలు 

తోపులాటలో కిందపడిన నేతలు.. జగదీశ్‌రెడ్డికి అస్వస్థత 

మహిళా నేతల ఆవేదన.. విలపించిన సునీతా లక్ష్మారెడ్డి 

హరీశ్, కేటీఆర్‌ సహా నేతల అరెస్టు.. తెలంగాణ భవన్‌కు తరలింపు 

బీఏసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డు కోవడం తోపులాటకు దారితీసింది. నేతలు కింద పడిపోవడం, అస్వస్థతకు గురికావడం, నిరసనలు, నినాదాలు, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు దారి తీసింది. పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ మండిపడింది. సభలో అడుగు పెట్టక ముందే తమను అడ్డుకుని, తమ పార్టీ సభ్యులపై పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించింది. పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా ఎమ్మెల్యేల గొంతు పిసికారని, చీరలు లాగారనే ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇది శాసనసభా? కౌరవసభా? అని బీఆర్‌ఎస్‌ నిలదీసింది. మరోవైపు పోలీసులతో జరిగిన వాగ్వాదం సందర్భంగా శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం మండిపడింది. సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. సదరు సభ్యుడితో రాజీనామా చేయించి, ప్రతిపక్ష నేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ సభ్యులు కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే తమపై జరిగిన దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని, హోంమంత్రిగానూ వ్యవహరిస్తున్న ఆయనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఘటనలు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ నడుమ సభ లోపలా, బయటా ఆరోపణలు, విమర్శలు, పరస్పర సవాళ్లకు తెరతీశాయి.  

విలపిస్తున్న సునీతారెడ్డిని ఓదారుస్తున్న సబితారెడ్డి  

టీషర్టు విప్పి లోనికి అనుమతించాలన్న హరీశ్‌రావు 
సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కు వద్ద ఉన్న అమరుల స్తూపానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే­లు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అనంతరం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరయ్యేందుకు నల్లని టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్దకు చేరుకున్నారు. ‘హామీల అమల్లో కాంగ్రెస్‌ వైఫల్యం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అంటూ టీషర్టులపై నినాదాలు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. బీఆర్‌ఎస్‌ సభ్యు­లు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మెయిన్‌ గేటు వద్ద బైఠాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌­రావు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. దీంతో ఆగ్రహించిన హరీశ్‌రావు తాను ధరించిన నల్ల టీ షర్టు­ను విప్పి విసిరేశారు. ఎలాంటి నినాదాలు లేనందున తన­ను అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి కూడా టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును పోలీసు వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలించారు. 

మహిళా నేతల ఆవేదన 
అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. జగదీశ్‌రెడ్డి అస్వస్థతకు గురికాగా.. ఎమ్మెల్యేలు సుదీర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ తదితరులు సపర్యలు చేశారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేటీఆర్‌ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జుట్టు పట్టుకుని, గొంతు నొక్కారని సబిత ఆరోపించగా, తన చీర లాగారంటూ సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సబిత, సునీత, కోవా లక్ష్మితో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాధవరం కృష్ణారావు తదితరులు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement