breaking news
filing IT returns
-
రిటర్నుల దాఖలుకు రెడీనా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్ 1, 4లో మార్పులు ఐటీఆర్ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్–1 ఫారమ్‌కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్‌మన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది. ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ఐటీఆర్ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ కాలమ్‌ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్‌తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్‌లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు. వ్యాపారులైతే అదనపు వివరాలు వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్ 10–ఐఈఏ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్ 10–ఐఈఏ గత ఫైలింగ్‌ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు. టీడీఎస్ వివరాలు ఈ ఏడాది ఐటీఆర్ 1, 2, 3, 5లో టీడీఎస్ కాలమ్‌లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా తెలిపారు. మూలధన నిబంధనల్లో మార్పులు 2024 బడ్జెట్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్‌లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి. అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై లాభం అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్‌లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. బైబ్యాక్ సైతం డివిడెండే2024 అక్టోబర్ 1 నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్‌లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మాత్రం బైబ్యాక్‌లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు. 80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ 80డీడీ లేదా సెక్షన్ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్ 10–ఐఏతోపాటు (మెడికల్ సర్టీ ఫికెట్) డిజేబిలిటీ సర్టిఫికెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (వైకల్య సర్టిఫికెట్ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్‌లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఎవరికి ఏ ఫారమ్? ఐటీఆర్–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్‌కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్–1 వర్తించదు. ఐటీఆర్–2: వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్‌లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే, అన్‌లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: ఐటీఆర్–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్ ఇన్‌కమ్‌ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఐటీఆర్–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, పార్ట్నర్íÙప్ ఫర్మ్‌లు (ఎల్ఎల్పీలు కాకుండా).. ఐటీఆర్–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్ ఇన్కమ్ (టర్నోవర్‌పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5: ఎల్ఎల్పీలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు (ఏవోపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐలు), ఆర్టీఫీషియల్ జ్యురిడికల్ పర్సన్ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది. ఐటీఆర్–6: సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–7: సెక్షన్ 139(4ఏ), లేదా సెక్షన్ 139(4బి) లేదా సెక్షన్ 139(4సి), లేదా సెక్షన్ 139(4డి), లేదా సెక్షన్ 139(4ఈ), లేదా సెక్షన్ 139(4ఎఫ్)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్–7 వర్తిస్తుంది. డిజిటల్ ఫారమ్ 16 ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారమ్ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్) ఫారమ్ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫారమ్ 16 డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్ ఫారమ్ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్‌గా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్‌లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి. ఇవి గమనించాలి.. → వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్‌లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. → ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ 31. → సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. → రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31 వరకు బిలేటెడ్/లేట్ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది. → అప్డేటెడ్ రిటర్నులను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీఆర్ తప్పులు.. ట్యాక్స్‌పేయర్లకు అలర్ట్..
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే కీలక అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన అప్డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే నిబంధన పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వారి రిటర్నులను ఈ మార్చి 31 లోపు అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది..అప్డేటెడ్ ఐటీఆర్ నిబంధనస్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి, లిటిగేషన్‌ను తగ్గించడానికి అప్డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటెడ్ రిటర్న్‌ను సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ఇది అనుమతిస్తుంది. ఉదాహరణకు 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) తమ రిటర్నులను అప్డేట్ చేయాలనుకున్నవారు 2025 మార్చి 31లోగా ఫైల్ చేయాలి.గమనించాల్సిన కీలక అంశాలుఅప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను మొత్తం సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత అదనపు పన్ను పెరుగుతుంది.కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహా చాలా సందర్భాల్లో అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణకు సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే, పన్ను రిఫండ్ లేదా అధిక రిఫండ్‌కు దారితీస్తే లేదా పన్ను చెల్లింపుదారు పన్ను అధికారుల విచారణలో ఉంటే అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు వీలుండదు.తొలుత అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు గరిష్టంగా రెండేళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2025 బడ్జెట్లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి ఫైలింగ్‌లలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది.అప్డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంటే..ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐటీఆర్-యు ఫారాన్ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు అప్డేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కింది దశలు ఉంటాయి..ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ క్రెడిన్షియల్స్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్నుతో సహా అవసరమైన వివరాలను అందించండి.సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచిన సమయం ఆధారంగా చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.వివరాలను సమీక్షించి అప్డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయండి. -
గడువు తేదీ గడిచిపోయిందా..
రెండు రోజులు ఆలస్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా అందరికీ అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటూ.. ‘‘గడువు తేదీ’’ని కేవలం ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు వేసే కోణంలోనే పరిశీలిద్దాం. 2024 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరపు రిటర్నులు వేయడానికి గడువు తేదీ 2024 జూలై 31. మీలో చాలా మంది సకాలంలో వేసి ఉంటారు. ఈసారి రిటర్నులు వేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డిపార్టుమెంటు వారు చెప్తున్నారు. అనారోగ్యం కానివ్వండి. విదేశాయానం కానివ్వండి. కారణం ఏదైనా కానివ్వండి. మీరు రిటర్ను ఇంకా వేయలేదా? చింతించకండి. బెంగ వద్దు. ఇలాంటి వారికి చక్కని రాజమార్గం ఉంది. లేటు ఫీజు కట్టాలి. ఇలా లేటు ఫీజు చెల్లించినవారికి 2024 డిసెంబర్ 31 వరకు గడువు తేదీ ఉన్నట్లు లెక్క. అంటే మరో రెండు నెలల పదిహేను రోజులు. అలా అని ఆలస్యం చేయకండి.ఎంత లేటు ఫీజు చెల్లించాలి.. ఆలస్యమైన నెలలతో సంబంధం లేకుండా రెండు రకాల నిర్దేశిత రుసుములు ఉన్నాయి. పన్నుకి గురయ్యే ఆదాయం.. రూ. 5,00,000 లోపల ఉంటే రూ. 1,000 చెల్లించాలి. పన్నుకి గురయ్యే ఆదాయం రూ. 5,00,000 దాటి ఉన్నట్లయితే, ఫీజు రూ. 5,000 ఉంటుంది. ఇవి మారవు. అంటే మీరు ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 లోపల ఎప్పుడు దాఖలు చేసినా రుసుములంతే. అయితే, పన్ను చెల్లించాల్సి ఉంటే వడ్డీ విధిస్తారు. ఇది నెలకు 1 శాతం చొప్పున వడ్డిస్తారు.రిఫండు క్లెయిమ్ చేసినా అప్పటికి పన్ను చాలా చెల్లించినట్లయితే, ఈ వడ్డీ పడదు. పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే మీరు తొందరపడాల్సి ఉంటుంది. వడ్డీని తగ్గించుకోవచ్చు. మీరు బయటి నుంచి 1 శాతం వడ్డీతో అప్పు తెచ్చి పన్ను భారం చెల్లించే బదులు ఆ వడ్డీ మొత్తం ఏదో ‘సీతమ్మగారి పద్దు’లో పడేలా ప్లాన్ చేసుకోండి. మీ ఆర్థిక వనరులను ప్లాన్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి. ఈ వెసులుబాటనేది ‘తత్కాల్’ టిక్కెట్టు కొనుక్కుని రైల్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. అయితే, రిటర్ను గడువు తేదీలోగా దాఖలు చేయకపోవడం వల్ల రెండు పెద్ద ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి విషయంలో ఎలాంటి వెసులుబాటు లేదు. గడువు తేదీ లోపల రిటర్ను వేసేవారికి డిపార్టుమెంటు రెండు ప్రయోజనాలు పొందుపర్చింది. ఆ రెండు ప్రయోజనాలూ లేటు విషయంలో వర్తించవు. ఇంటి మీద ఆదాయం లెక్కింపులో మనం లోన్ మీద వడ్డీని నష్టంగా పరిగణిస్తాం.ఆ నష్టాన్ని పరిమితుల మేరకు సర్దుబాటు చేసి, ఇంకా నష్టం మిగిలిపోతే దాన్ని రాబోయే సంవత్సరాలకు బదిలీ చేసి, నష్టాన్ని.. ఆదాయాన్ని సర్దుబాటు చేస్తాం. దీని వల్ల రాబోయే సంవత్సరంలో పన్ను భారం తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా, ఉపశమనంగా ఉంటుంది. లేటుగా రిటర్ను వేస్తే ఈ ‘బదిలీ’ ప్రయోజనాన్ని ఇవ్వరు. ఈ సదుపాయాన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుంది.ఇక రెండోది.. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పద్ధతి లేదా కొత్త పద్ధతుల్లో.. మనం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సాధారణంగా పన్ను తగ్గే పద్ధతి ఎంచుకుంటాం. మనం గడువు తేదీ లోపల రిటర్ను వేయకపోతే, ఇలా ఎంచుకునే అవకాశం ఇవ్వరు. కంపల్సరీగా కొత్త పద్ధతిలోనే పన్నుభారాన్ని లెక్కించాలి. అయినా, రిటర్ను వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.1. ఇది మీ ఆదాయానికి ధృవపత్రం అవుతుంది 2. రుణ సౌకర్యం లభిస్తుంది 3. విదేశీయానం అప్పుడు వీసాకి పనికొస్తుంది 4. చట్టంలో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు 5. పెనాల్టీ మొదలైనవి ఉండవు కాబట్టి రిటర్నులు వేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆ ఐడీతో కుదరదు!
దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరు. ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..దేశంలో మొదటి ఆధార్ కార్డ్ 2010 సంవత్సరంలో జారీ అయింది. ఇప్పటి వరకు, దేశంలోని జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డ్ ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు కొత్త రూల్ జారీ అయింది.ఇంతకు ముందు, ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడీని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడీని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించలేరు.ఇప్పుడు పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతకుముందులాగా ఆధార్ కార్డ్ లేకపోతే, ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డ్‌ని పొందేందుకు ఇప్పుడు వీలులేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ సరిపోదు. ఆధార్ కార్డు నంబర్ ఉండాల్సిందే. -
సమీపిస్తున్న గడువు.. ఐటీ శాఖ బిగ్ అప్డేట్!
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి రోజు. పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. గడువు సమీపిస్తుండడంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో రిటర్న్స్ దాఖలయ్యాయి.ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. గతేడాదిలో దాఖలైన ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది.గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్న్స్ పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. కాగా గతేడాది మొత్తం 8.61 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. -
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్‌తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు. -
2022–23లో ఐటీఆర్ ఫైలింగ్ @ 7.40 కోట్లు: కేంద్రం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్‌సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీఆర్‌లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు. ‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్ ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు. -
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్‌లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్‌లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్‌కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
6.50 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చారు. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం రిటర్నుల సంఖ్య 6.50 కోట్లకు చేరింది. వేతన జీవులు, ఆడిటింగ్ అవసరం లేని వారు రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ కావడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి దాఖలైన 5.83 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 15 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ‘‘ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇందులో 36.91 లక్షల ఐటీఆర్‌లు 31వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు నమోదయ్యాయి’’అంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది.పన్ను ఎగవేతకు రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు, నిబంధనలను అనుసరించే వారు పెరగడంతో పన్ను చెల్లింపుదారుల బేస్ విస్తృతం అవుతున్నట్టు పన్ను నిపుణులు అభిప్రా యపడుతున్నారు. డేటా అనలైటిక్స్, ఇతర సమాచారం ఆధారంగా అధిక రిస్క్ కేసులను ఆదాయపన్ను శాఖ గుర్తించి, వారికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపడుతుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ప్రాపర్టీల కొనుగోలు, విక్రయాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీల సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ సమీకరించి, విశ్లేíÙస్తున్నట్టు చెప్పారు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే..
ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు తేదీ సమీపించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్ హడావుడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం గడువు తేదీ పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ సందర్భంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు ఎదురైనట్లు కొంతమంది పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి ➤ Income Tax Refund: ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదంటూ ఓ ట్యాక్స్ పేయర్ ట్విటర్లో ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును మారో 30 రోజుల పాటు పొడిగించాలని కోరారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. “ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం జులై 29 వరకు 5.73 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. వీటిలో 4.9 కోట్లకు పైగా రిటర్న్‌లను వాటిని దాఖలు చేసిన ట్యాక్స్ పేయర్లు వెరిఫై చేశారు. అలాగే 3.18 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000. దీంతోపాటు గడువు తేదీలోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే అనేక ఇతర పరిణామాలు ఉంటాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు Dear @NeeleshTax, The e-filing portal is working fine. May we request you to write to us at orm@cpc.incometax.gov.in detailing the specific issue you've encountered (along with PAN, your mobile no. & a screenshot of the error). Our team will get in touch with you. — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా?
ఆదాయపు పన్ను రీఫండ్ ప్రాసెసింగ్ ఇప్పుడు వేగంగా మారింది. ట్యాక్స్ రీఫండ్ల కోసం వారాల పాటు వేచి ఉండాల్సి పని లేదు. 2023-24 అసెస్మెంట్ ఇయర్‌కు గానూ ఇటీవల తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసిన చాలా మందికి కొన్ని రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. తాను ఐటీఆర్ ఫైల్ చేసిన 12 గంటల్లోనే ట్యాక్స్ రీఫండ్ పొందినట్లు ఓ పన్ను చెల్లింపుదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన నిర్ణయ్ కపూర్ అనే ట్విటర్ యూజర్ తన ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ మెసేజ్ స్క్రీన్షాట్లను షేర్ చేశారు. ట్యాక్స్ రీఫండ్‌ను ఇంత వేగంగా ప్రాసెస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాసుకొచ్చారు. నిర్ణయ్ కపూర్ జూలై 27 ఉదయం తన ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయగా అదే రోజు సాయంత్రంలోగా ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ట్యాక్స్ ఫైలింగ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఐటీఆర్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెసింగ్‌లో వేగం పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఐటీఆర్‌లు దాఖలు చేసిన ఒక్కరోజులోనే ప్రాసెస్ చేయడం గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారు రిఫండ్ ప్రాసెసింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్యాక్స్ నిపుణలు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవస్థ ఇప్పుడు చాలా వేగంగా మారిందని, పన్ను చెల్లింపుదారులు ముందస్తు రీఫండ్‌కు అర్హులు కావాలంటే వీలైనంత త్వరగా తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా మందికి తెలియని మరో ప్రయోజనం కూడా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్‌పై నెలకు 0.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుందని తెలిసిందే. అయితే మీరు ఐటీఆర్ దాఖలు చేసినప్పటి నుంచి ఇది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆ ప్రయోజనం పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31. కాగా జూలై 27 వరకు, 5 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. అలాగే ఇప్పటికే 2.69 కోట్ల వెరిఫైడ్ ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. -
ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ పొరపాట్లు, తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తప్పులు ఆదాయపు పన్ను శాఖ నుంచి పెద్ద మొత్తంలో జరిమానాలు, నోటీసులకు దారి తీయవచ్చు. ఐటీఆర్ దాఖలును విస్మరించడం, ఆదాయాన్ని తక్కువగా, తప్పుగా చూపించడం వంటి వాటికి పాల్పడిన సుమారు లక్ష మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తెలిపారు. అటువంటి నోటీసులకు, జరిమానాలకు గురికాకూడదంటే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ సూచన మేరకు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీ శాఖ నోటీసులకు, జరిమానాలకు గురి చేసే అవకావం ఉన్న కొన్ని సాధారణ తప్పులు ఇక్కడ తెలియజేస్తున్నాం. వాటిని గుర్తించి ఆ తప్పులు లేకుండా ఐటీఆర్ దాఖలు చేయండి. సరికాని ఐటీఆర్ ఫారం ఎంపిక మీ ఆదాయ స్వభావం, పన్ను చెల్లింపుదారుల వర్గం ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి. తప్పు ఫారమ్‌ను ఉపయోగించడం వలన మీ రిటర్న్ లోపభూయిష్టంగా మారవచ్చు. ఉదాహరణకు, జీతం పొందే వ్యక్తులు ఐటీఆర్ ఫారం-1ని ఫైల్ చేయాలి. మూలధన లాభాల ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫారం-2ని ఉపయోగించాలి. ఫారమ్ 26AS, టీడీఎస్ సర్టిఫికేట్‌ను విస్మరించడం మీ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఫారమ్ 26ASని పూర్తిగా ధ్రువీకరించండి. ఈ పత్రంలో ముఖ్యమైన ఆదాయ వివరాలు, పన్ను మినహాయింపులు, ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ అసెస్మెంట్ పన్నుతోపాటు అర్హత కలిగిన పన్ను క్రెడిట్లు ఉంటాయి. ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఫారం 16తో సరిచూసుకోవడం అవసరం. దీంతోపాటు వార్షిక సమాచార ప్రకటన (AIS)తో కూడా చెక్ చేసుకోండి. ఐటీ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ రెండు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధిక విలువ లావాదేవీలను దాచడం మీరు ఆదాయ వివరాల్లో ఆస్తి కొనుగోళ్లు లేదా గణనీయమైన క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలను దాచిపెడతే ఐటీ శాఖ నోటీసు జారీ చేయవచ్చు. ఈ లావాదేవీల కోసం ఉపయోగించిన నిధుల మూలానికి సంబంధించి వారు వివరణ కోరవచ్చు. వ్యత్యాసాలను నివారించడానికి, మీ ఖర్చు, నివేదించిన ఆదాయం మధ్య స్థిరత్వం ఉండేలా చూసుకోండి. బోగస్ తగ్గింపులు, క్లెయిమ్‌లు మీకు వర్తించని తగ్గింపులను క్లెయిమ్ చేయొద్దు. ఉదాహరణకు, మీరు పనిచేసే సంస్థ జారీ చేసిన ఫారమ్ 16లో పేర్కొన్నదానికి విరుద్ధంగా హెచ్ఆర్ఏ లేదా సెక్షన్ 80C వంటి తగ్గింపులను క్లెయిమ్ చేస్తే ఐటీ శాఖ కచ్చితంగా దృష్టి పెడుతుంది. వీటిపై విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. తప్పుడు వ్యక్తిగత సమాచారం మీ రిటర్న్‌లో పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, పాన్, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను అందించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ వివరాలు వాస్తవ, తాజా సమాచారంతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. సరైన బ్యాంక్ వివరాలను అందించకపోతే అర్హమైన పన్ను రీఫండ్లను పొందడంలో జాప్యం జరుగుతుంది. గడువు తేదీని దాటిపోవడం జరిమానాలను నివారించడానికి గడువు తేదీ జూలై 31లోపు మీ ఐటీఆర్‌ని ఫైల్ చేయండి. ఒక వేళ గడువు మించిపోతే రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఆలస్య రుసుము, నెలకు 1 శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం వలన ట్యాక్స్ రీఫండ్ పొందడం కూడా ఆలస్యమవుతుంది. ఆదాయ మార్గాలను దాచడం మీ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఆదాయ మార్గాలను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. మీరు జీతం పొందే వ్యక్తి అయినప్పటికీ, పన్ను నుంచి మినహాయించిన వాటితో సహా ఏదైనా ఇతర ఆదాయాన్ని పొందుతుంటే తప్పనిసరిగా ప్రకటించాలి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అవగాహన లోపం కారణంగా మినహాయింపు ఆదాయ వివరాలను అనుకోకుండా వదిలేస్తుంటారు. అసెస్మెంట్ సంవత్సరాన్ని తప్పుగా ఎంచుకోవడం మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు మీరు ఆదాయాన్ని ఆర్జించిన ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించే తగిన అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంచుకున్నారో లేదో నిర్ధారించుకోండి. ఈ సంవత్సరం అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ కోసం అసెస్మెంట్ ఇయర్ 2023-2024 అవుతుంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. -
పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్ మొత్తం సంబంధిత ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్ చేయండి. 26ASలో టీడీఎస్ ప్రతిబింబిస్తే టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్ ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్‌ను సమర్పించాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సరైన పన్ను విధానం ఎంపిక మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు, మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఈ-రిటర్న్ ధ్రువీకరణ ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్‌ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్ సమర్పించాలి. ఆధార్‌తో లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్ రీఫండ్‌ను పెంచుతుంది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్‌లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్‌లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. Do finish this important task and unwind this weekend. The due date to file your #ITR for AY 2023-24 is 31st July, 2023.#FileNow and spend your weekend without any worry. Pl visit https://t.co/GYvO3mStKf#ITD pic.twitter.com/ngLwU8Hzbi — Income Tax India (@IncomeTaxIndia) July 15, 2023 -
ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి?
జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభమైంది. ఎప్పటి నుంచో పొడించుకుంటూ వస్తున్న ఆధార్-పాన్ లింకింగ్ గడువు జూన్ 30వ తేదీతో ముగిసిపోయింది. ఇక పొడిగింపు ఉండదని ఆదాయపు పన్న శాఖ తేల్చి చెప్పేసింది. అయితే జూలై నెలలో పూర్తి చేయాల్సిన ఫినాన్సియల్ డెడ్లైన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఐటీఆర్ దాఖలు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 ఆఖరు తేదీ. గడువు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందడం సహజం. అయితే ఫారమ్ 16, 26AS, వార్షిక సమాచార స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వడ్డీ, మూలధన లాభాల స్టేట్మెంట్ వంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం, తరచుగా చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులువుగా పూర్తి చేయవచ్చు. చివరి నిమిషంలో హడావుడి తప్పులకు దారితీస్తుంది.ఆదాయపు పన్ను రిటర్న్‌ను సంబంధిత డాక్యుమెంట్లు జోడించకుండా ఫైల్ చేయడం వలన తక్కువ రిపోర్టింగ్‌కు దారి తీయవచ్చు. దీనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ఆఖరు వరకు వేచి ఉండకుండా కాస్త ముందుగానే ఐటీఆర్ ఫైల్ ఉత్తమం. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువును జూలై 11 వరకు పొడిగించింది. అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్లను ఆన్లైన్ ద్వారా ఎంచుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉద్యోగి UAN, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ వంటి నిర్దిష్ట వివరాలను అందించాలి. దరఖాస్తు ధ్రువీకరణ కోసం ఉద్యోగి ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ధ్రువీకరణ ప్రక్రియ తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలు, చందా సమాచారంతో కూడిన మునుపటి క్రియాశీల పీఎఫ్ లేదా పెన్షన్ ఖాతాల గురించిన సమాచారాన్ని అందించాల్సిన అప్లికేషన్ తదుపరి పేజీకి వెళ్తారు. ఇక్కడ సమాచారంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం పూర్తయ్యాక ఒక రసీదు సంఖ్య వస్తుంది. దాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం దాచుకోవాలి. అధిక పెన్షన్ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఈపీఎఫ్‌వో లింక్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా.. -
కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా..
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year. One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia — All India Radio News (@airnewsalerts) June 27, 2023 -
49th GST Council Meeting: జీఎస్టీ ఫైలింగ్ ఆలస్య రుసుము తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్ ఆలస్య రుసుమును హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి 49వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను నమోదిత వ్యక్తులు ఫామ్ జీఎస్టీఆర్–9కు సంబంధించి రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటే ఆలస్య రుసుము రోజుకు రూ.50, రూ.5–20 కోట్ల టర్నోవర్ ఉంటే రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ.200 ఉంది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఫామ్ జీఎస్టీఆర్–4, ఫామ్ జీఎస్టీఆర్–9, ఫామ్ జీఎస్టీఆర్–10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపు లేదా ఆలస్య రుసుము తగ్గించడం ద్వారా క్షమాభిక్ష పథకాలను జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహార బకాయిలు.. 2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు, అలాగే ఆరు రాష్ట్రాలకు మరో రూ.16,524 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. కేంద్రం తన సొంత వనరుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుందని, భవిష్యత్తులో పరిహార రుసుము వసూళ్ల నుంచి ఈ మొత్తాన్ని తిరిగి పొందుతామని ఆమె చెప్పారు. దీంతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేళ్ల కాలానికి తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాలు వారి అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికేట్లను ఇచ్చినప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏవైనా పరిహార రుసుము మొత్తాలను వెంటనే క్లియర్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిహార బకాయి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు సమకూరనున్నాయి. బెల్లం పానకంపై తగ్గింపు.. ఇక విడిగా విక్రయించే బెల్లం పానకంపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్ చేసి బెల్లం పానకం విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెన్సిల్ షార్ప్నర్స్కు 18 శాతం నుంచి జీఎస్టీని 12 శాతానికి చేర్చారు. పన్ను ఎగవేతలను ఆరికట్టడంతోపాటు పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు వంటి వస్తువుల నుండి ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) నూతన రిటర్నులు (ఐటీఆర్‌లు) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తెలిపింది. దీంతో అసెస్మెంట్ సంవత్సరం మొదటి రోజు నుంచే (2023 ఏప్రిల్ 1) రిటర్నులు దాఖలు చేసుకోవడం వీలవుతుంది. గతేడాదితో పోలిస్తే, ఐటీఆర్‌లలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961లో చేసిన సవరణల మేరకు స్వల్ప మార్పులను ప్రవేశపెట్టినట్టు స్పష్టం చేసింది. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు పత్రాలను సీబీడీటీ నోటిఫై చేయడం తెలిసిందే. సాధారణంగా ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐటీఆర్‌లను నోటిఫై చేస్తుంటారు. ఈ విడత ముందుగానే ఈ ప్రక్రియను సీబీడీటీ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
అప్డేటెడ్ ఐటీఆర్‌ల రూపంలో రూ.400 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల సవరణకు అనుమతించడం వల్ల.. కొత్తగా 5 లక్షల సవరించిన (అప్డేటెడ్) రిటర్నులు దాఖలు కావడంతోపాటు, రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం కేంద్రానికి వచ్చింది. ఫైనాన్స్ యాక్ట్, 2022లో సవరించిన రిటర్నుల క్లాజును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఒకసారి రిటర్నులు సమర్పించిన అసెస్మెంట్ ఏడాది నుంచి, రెండేళ్లలోపు సవరణలు దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఐటీఆర్–యు పత్రం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చింది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైనా ఆదాయం వెల్లడించకపోయి ఉంటే, ఈ నూతన ఫామ్ రూపంలో సవరణలు దాఖలు చేసుకునే అవకాశం లభించింది. దీంతో 5 లక్షల మంది ఐటీఆర్–యు దాఖలు చేసి రూ.400 కోట్ల పన్ను చెల్లించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిబంధనల అమలు సులభతరం అయిందని, కార్పొరేట్లు సైతం సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ‘‘ఒక కంపెనీ సవరించిన రిటర్నులు సమర్పించి రూ.కోటి పన్ను చెల్లించింది. స్వచ్ఛందంగా నిబం«దనలను అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. ప్రజలు పన్ను చెల్లించి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు’’అని ఆ అధికారి వాస్తవ పరిస్థితి వివరించారు. సవరణ రిటర్నుల్లో, గతంలో పేర్కొనని ఆదాయ వివరాలు వెల్లడిస్తున్నట్టు అయితే అందుకు కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
అలర్ట్: డెడ్‌లైన్ వచ్చేసింది.. లేదంటే రూ.5000 ఫైన్!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు రిటర్నుల దాఖలు గడువు సమీపించడంతో త్వరపడుతున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి 4.09 కోట్ల రిటర్నులు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఒక్క 28వ తేదీన 36 లక్షల రిటర్నులు సమర్పించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం (2022–23) రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31న చివరి తేదీ. ఇప్పటి వరకు రిటర్నులు వేయకపోతే వెంటనే ఆ పని చేయాలని, దీనివల్ల ఆలస్యపు ఫీజు చెల్లించే అవసరం ఏర్పడదని ఆదాయపన్ను శాఖ మరోసారి సూచించింది. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే.. వార్షిక ఆదాయం ₹ 5 లక్షల వరకు ఉన్నవారు ఫైన్ కింద ₹ 1,000, ₹ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ₹ 5,000 ఫైన్ కట్టాల్సిఉంది. ఆదాయపన్ను శాఖ గతేడాది నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. అయినా ఇప్పటికీ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు పన్ను చెల్లింపుదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువును పొడిగించాలంటూ డిమాండ్లు రాగా, గడువు పొడిగించేది లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. చదవండి: ఓలా ఉద్యోగులకు షాక్.. వందల మంది తొలగింపు..? -
నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!
సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్లైన్ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. ► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. ► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. ► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. ► రిఫండ్ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. ► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. ► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. ► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్మెంట్ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి భారీ ఊరట కల్పించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు(సెప్టెంబర్ 30, 2021 వరకు ఉన్న) గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగిస్తూ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ సీబీడీటీ సర్క్యులర్ నెం.17/2021 జారీ చేసింది. అకౌంట్లు ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సాధారణంగా ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారాలను ఉపయోగించి తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తుల కోసం ఈ గడువును పొడగించారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు గడువును గతంలో జూలై 31, 2021 వరకు పొడిగించారు. అయితే, కొత్త ఆదాయపు పన్ను ఈ -ఫైలింగ్ పోర్టల్ లో సమస్యలు రావడం, కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 30 వరకు మళ్లీ పొడగించారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం వ్యక్తులకు సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువు తేదీని నాలుగుసార్లు పొడిగించింది. మొదట జూలై 31 నుంచి నవంబర్ 30, 2020 వరకు, తర్వాత డిసెంబర్ 31, 2020 వరకు, చివరకు జనవరి 10, 2021 వరకు సీబీడీటీ పొడగించింది. -
ఐటీఆర్1-4కు ఆఫ్‌లైన్ యుటిలిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల పత్రాలైన ఐటీఆర్1, 4 దాఖలు చేసే వారి కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీని ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. ఈఫైలింగ్ పోర్టల్‌లో ఈ ఆఫ్‌లైన్ యుటిలిటీ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ (జేఎస్వోఎన్) అనే నూతన టెక్నాలజీ ఆధారితంగా ఇది పనిచేస్తుందని పేర్కొంది. ‘‘విండోస్ 7, ఆ తర్వాతి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన కంప్యూటర్లలో ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఐటీఆర్-1, ఐటీఆర్-4కు మాత్రమే పనిచేస్తుంది. ఇతర ఐటీఈఆర్లను తర్వాత జోడించడం జరుగుతుంది’’ అంటూ ఆదాయపన్ను శాఖా ప్రకటించింది. ఆదాయపన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్ నుంచి ముందుగా నింపిన డేటా ఆధారిత రిటర్నులను డౌన్లోడ్ చేసుకుని, మిగిలిన డేటాను నింపిన అనంతరం దాఖలు చేయవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీఆర్ అప్లోడ్ చేసేందుకు ఇంకా అనుమతించనందున.. ఐటీఆర్‌ను పూర్తిగా నింపి ఆఫ్‌లైన్ యుటిలిటీలో సేవ్ చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖా తెలిపింది. నూతన యుటిలిటీ అన్నది రిటర్నుల దాఖలు చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని నాంజియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ నేహా మల్హోత్రా పేర్కొన్నారు. సాధారణ బీమా సంస్థలకు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సాధారణ బీమా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరలకు సంబంధించి ముసాయిదా నిబంధనలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) విడుదల చేసింది.ముఖ్యంగా బీమా పాలసీల తయారీ విషయంలో అనుసరించాల్సిన కనీస కార్యాచరణను ఇందులో నిర్దేశించింది. బీమా సంస్థల్లో సమర్థతను పెంచడం ద్వారా పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలూ ఇందులో ఉన్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అప్పుడు అన్ని సాధారణ బీమా ఉత్పత్తులు, యాడాన్ కవర్లకు ఇవి వర్తిస్తాయి. -
రిటర్న్‌ల ప్రాసెసింగ్ ఒక్క రోజులో..!
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రాసెస్ చేయటంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి రూ.4,242 కోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు డెవలపర్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం (ఐటీ) ఇన్ఫోసిస్‌ను ఎంపికచేసింది. ప్రాజెక్టు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుంది. మూడు నెలలు ప్రాజెక్టు పరీక్షా సమయం. అటు తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం విలేకరులకు పియూష్ గోయెల్ తెలిపిన వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుతం రిటర్న్‌లు ఫైల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ సమయం 63 రోజులు పడుతోంది. తాజా వ్యవస్థ అమలోకి వచ్చిన తర్వాత ఈ సమయం కేవలం 24 గంటలకు తగ్గిపోతుంది. దీనితో రిఫండ్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ► కేబినెట్ ఆమోదముద్ర వేసిన ఆదాయపు పన్ను శాఖ ఇంటిగ్రేటెడ్ ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు రూపకల్పనకు బిడ్డింగ్ ప్రాసెస్‌లో ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేశారు. ► ప్రస్తుతం ఉన్న వ్యవస్థ విజయవంతమైనదే అయినప్పటికీ, తాజా వ్యవస్థ మరింత ట్యాక్స్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి పారదర్శకతనూ పెంపొందిస్తుంది. అన్ని స్థాయిల్లోనూ ఆటోమేషన్ సౌలభ్యం ఏర్పడుతుంది. ► ఆదాయపు పన్ను శాఖ ప్రమేయం ఏమాత్రం లేకుండా పన్ను చెల్లింపుదారుల అకౌంట్లోకి డైరెక్ట్‌గా రిఫండ్స్ జారీ అవుతాయి. ► ప్రస్తుత సీపీసీ–ఐటీఆర్ 1.0 ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికిక్యాబినెట్ మరో రూ.1,482 కోట్లను మంజూరు చేసింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు రూ.22,594 కోట్లు అస్సోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ రూ.22,594 కోట్ల కేటాయించింది. ఈశాన్య భారత ఇంధన అవసరాలను తీర్చడానికి వీలుగా కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. 1999లో నెలకొల్పిన ఈ రిఫైనరీలో భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)కు 61.65 శాతం వాటా ఉంది. ఏడాదికి ప్రస్తుతం 3 మి. టన్నుల క్రూడ్ రిఫైన్ చేస్తోంది. ఈ సామర్థాన్ని 6 మి. టన్నులకు పెంచడం క్యాబినెట్ ప్రస్తుత నిర్ణయ ఉద్దేశమని పియూష్ గోయెల్ తెలిపారు. 48 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కింద పారాదీప్(ఒడిస్సా) నుంచి నుమాలిగఢ్కు క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌ను నిర్మిస్తారు. నుమాలిగఢ్ నుంచి సిలిగురి (పశ్చిమ బెంగాల్) వరకూ ప్రొడక్ట్ పైప్‌లైన్ ఏర్పాటవుతుంది. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.6,000 కోట్లు ప్రభుత్వరంగంలోని ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్పోర్ట్– ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్యకలాపాల విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యాంకుకు తాజా మూలధనంగా రూ.6,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి రీక్యాపిటలైజేషన్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకులకు జారీ అయ్యే తరహాలోనే ఈ రీక్యాపిటలైజేషన్ బాండ్లు జారీ అవుతాయి. ప్రస్తుత (రూ.4,500 కోట్లు), వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో (రూ.1,500 కోట్లు) బ్యాంకుకు రెండు విడతల్లో బ్యాంకుకు తాజా మూలధనం అందుతుంది. బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచడానికి కూడా క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. -
ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును ప్రభుత్వం పొడిగించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్‌కు ఉన్న తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్ 15కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆడిట్ రిపోర్టు తుది గడువు కూడా అక్టోబర్ 15గానే నిర్ణయించింది. ఈ కొత్త మార్గదర్శకాలు, రూ.2 కోట్లకు పైన ఆదాయం ఆర్జించే వారికి, ఛార్టెడ్ అకౌంట్లు ఇంకా తమ అకౌంట్లను ఆడిట్ చేసే అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారులకు వర్తించనున్నాయి. అయితే పన్ను చెల్లించడానికి మాత్రం సెప్టెంబర్ 30నే తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పలువురు స్టేక్‌హోల్డర్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు, ఐటీఆర్‌లు, ఆడిట్ రిపోర్టుల తుది గడువును పెంచాం. కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు ఈ తుది గడువు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15కు పెరిగింది’ అని సీబీడీటీ తెలిపింది. సీబీడీటీ తుది గడువును పెంచడం స్వాగతించాల్సిన విషయమని ట్యాక్స్ పార్టనర్ సమీర్ కనబార్ తెలిపారు. అంతకముందు 2017-18లో పన్ను చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ.10.03 లక్షల కోట్లకు పెరిగినట్టు సీబీడీటీ తెలిపింది. -
అక్టోబరు 17వరకు గడువు పెంపు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆడిట్ చేయాల్సిన ఖాతాదారుల ఆదాయ పన్ను చెల్లింపుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2016 ఆదాయపు పన్ను చట్టం క్రింద వీరి ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీని అక్టోబర్ 17 కు పెంచింది. పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారి అసౌకర్యానికి తొలగించే క్రమంలో ఈ గడువును పెంచినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ఆదాయపు డిక్లరేషన్ పథకం కింద సెప్టెంబరు 30 చివరి తేదీని పరిగణనలోకి తీసుకొని, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు ( సీబీడీటీ ) ఈ నిర్ణయం తీసుకుంది. 2015-16 సంవత్సరానికి గాను బిజినెస్ రీసీట్స్ కోటి రూపాయలకు మించిన లేదా ప్రొఫెనల్ రిసీట్స్ పాతిక లక్షలకు మించిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికిగాను ఈ సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబర్ 17 లోపు ఆయా ఆడిట్ రిపోర్ట్ తో కూడిన ఐటి రీటర్న్స్ ను ఫైల్ చేయాలని తెలిపింది.