
కొండాపూర్ రేవ్ పార్టీ కీలక సూత్రధారి అశోక్‌కుమార్
స్వస్థలం గుంటూరు జిల్లాలోని కాజ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కొండాపూర్ రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్‌కుమార్‌గా అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కాజ. అశోక్‌కుమార్ వారాంతాల్లో ఏపీ నుంచి హైదరాబాద్‌కు యువతులను తీసుకెళుతుంటాడు. రేవ్ పార్టీల్లో వారితో అసభ్య నృత్యాలను చేయించడం, ఆపై డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై అత్యాచారానికి పాల్పడటం అతడి నైజమని పోలీసులు గుర్తించారు.
అదే గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కూడా అశోక్‌కుమార్‌కు రేవ్ పార్టీల్లో సహకరిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ ఎస్వీ సర్విస్ అపార్టుమెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో తెలంగాణ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేసి 9 కార్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్‌కుమార్ నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులనే అశోక్‌కుమార్ లక్ష్యంగా చేసుకుని రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అశోక్‌కుమార్ వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీలో హోటల్ మేనేజ్‌మెంట్ చదివాడు.
వ్యసనాలకు బానిసగా మారిన అతడు కొంతకాలంగా ఈ దందాలో దిగినట్టు పోలీసులు గుర్తించారు. కొరియర్ సర్వీస్‌లో పనిచేస్తున్న ఒక యువకుడు పార్సిల్ ద్వారా గంజాయి విక్రయించేవాడని, అతడితో అశోక్‌కుమార్ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అశోక్‌కుమార్ కొరియర్ ద్వారా గంజాయి విక్రయించేవాడని సమాచారం. ఇతను ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ గంజాయి కేసు నుంచి అశోక్‌ను తప్పించారని చెబుతున్నారు. అశోక్ కాజ సమీపంలోని ఓ వర్సిటీ విద్యార్థులకు కూడా గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.