జాబులు దాచి క్యాలెండర్
22 నెలల్లో 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు హుష్‌కాకి!
తాజాగా కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్
వైఎస్ జగన్ హయాంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు
బాబు పాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలే
అసెంబ్లీ సాక్షిగా ఆర్థికశాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలో బట్టబయలు
నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం
నెలకు రూ.3,000 చొప్పున భృతి ఇవ్వకుండా రూ.21,600 కోట్లు ఎగనామం
లక్షల మంది వలంటీర్లతో పాటు పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
వారి పొట్టగొట్టి రూ.1,500 కోట్లు మిగుల్చుకున్న కూటమి సర్కారు.. మరోవైపు 54,903 మంది కన్సల్టెంట్ల నియామకం.. జీతాల కింద రూ.3,054.78 కోట్లు.. పలుకుబడికి పెద్దపీట
సాక్షి, అమరావతి: ఒకపక్క ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతూ.. భృతి ఎగ్గొడుతూ.. నిరుద్యోగుల ఆశలను చంద్రబాబు సర్కారు చిదిమేస్తోంది. మరోవైపు ఆ మేరకు ఉద్యోగాలను తిరిగి భర్తీ చేయకుండా డ్రామాలాడుతోంది. రాష్ట్రంలో దాదాపు 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించేసి.. కేవలం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ సరికొత్త నాటకానికి తెర తీయడంపై యువత మండిపడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3,000 చొప్పున భృతి చెల్లిస్తామని సూపర్ సిక్స్‌లో ప్రధానంగా హామీ ఇవ్వడంతోపాటు ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికీ బాండ్లు పంచారు.
మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా భృతి కోసం పైసా కూడా కేటాయించకుండా రూ.21,600 కోట్లు ఎగ్గొట్టి తాజాగా జాబ్ క్యాలెండర్, పోస్టుల భర్తీ అంటూ మభ్యపుచ్చే యత్నాలకు దిగారు. నిజానికి చంద్రబాబు సర్కారు నిరుద్యోగ యువతకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టింది. మరోవైపు కన్సల్టెంట్ల పేరుతో పలుకుబడి కలిగిన వారికి ప్రజాధనాన్ని పంచి పెడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల బడ్జెట్ సమావేశాల చివరి రోజు స్వయంగా ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.
ఖాళీ పోస్టులు 1.72 లక్షలు..
ప్రతి ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను ద్రవ్య విధాన పత్రం ద్వారా వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2024 మార్చి నాటికి (వైఎస్ జగన్ హయాంలో) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నట్లు తాజా ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు.
మరోవైపు 2025 డిసెంబర్ నాటికి (చంద్రబాబు ప్రభుత్వంలో) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలు మాత్రమేనని ద్రవ్య విధాన పత్రంలో తెలియచేయడం గమనార్హం. అంటే చంద్రబాబు పాలనలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 1.72 లక్షలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు సర్కారు కళ్లుగప్పుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
కన్సల్టెంట్లకు రూ.3,054.78 కోట్లు
నిరుద్యోగ భృతిని సీఎం చంద్రబాబు ఒక భ్రాంతిగా మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా లక్షలాది మంది వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేసింది. వారి పొట్టగొట్టి ఏటా రూ.1,500 కోట్లను మిగుల్చుకుంది. ఒకపక్క నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా వృత్తిపరమైన సర్వీసుల పేరుతో పలుకుబడి కలిగిన వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లగా నియమించుకుంది.
ఈ విషయం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలోనే స్పష్టమైంది. చంద్రబాబు సర్కారు వృత్తిపరమైన సర్వీసుల పేరుతో ఏకంగా 54,903 మందిని కన్సల్టెంట్లగా నియమించుకుంది. వారికి వేతనాల రూపంలో ఏడాదికి ఏకంగా రూ.3,054.78 కోట్లు చెల్లిస్తోంది.

వలంటీర్లపై వేటు.. ఔట్ సోర్సింగ్ ఔట్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా వారికి వేతనాల కింద ఏడాదికి రూ.1,500 కోట్లు చెల్లించినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో చంద్రబాబు సర్కారు తెలిపింది. మరోపక్కతమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేసింది. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉండగా చంద్రబాబు సర్కారు అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో వారి సంఖ్య గతేడాది డిసెంబర్ నాటికి 87,681కి తగ్గిపోయినట్లు తెలిపింది.
అంటే చంద్రబాబు సర్కారులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 8,994 మంది తగ్గిపోయారు. చిరుద్యోగుల పొట్టగొట్టి పలుకుబడి గల పెద్ద వ్యక్తులను కన్సల్టెంట్లుగా నియమించుకోవడమే లక్ష్యంగా కూటమి సర్కారు పాలన సాగిస్తోంది. ఇక గతంతో పోలిస్తే జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ వర్కర్లు కూడా గణనీయంగా తగ్గిపోయారు.
ఇది పచ్చి మోసం
లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించేసి, కేవలం 10 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చూపడం దుర్మార్గం. 6 లక్షలపైన గ్రూప్–2 అభ్యర్థులు ఏళ్ల తరబడి చదువుతుంటే 750 పోస్టులు ప్రకటించడం, 11 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని డీజీపీ ప్రకటించినా, 2,778 పోస్టులే ప్రకటించడం ఏమిటీ? గత ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ 243 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులిచ్చినా, ఇప్పటిదాకా భర్తీకి చర్యలు చేపట్టలేదు.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ పెంచుతూ యువతను తీవ్రంగా మోసం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేసిన మంత్రి లోకేశ్‌కు ఇప్పుడు ఆ ఖాళీలు కనిపించడం లేదా? నిరుద్యోగుల సత్తా చూపుతాం. – రామచంద్ర ఏంబేటి, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు
వ్యాయామ విద్య పోస్టులు ఏమయ్యాయి?
జాబ్ క్యాలెండర్‌లో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. పాఠశాల వ్యాయామ విద్య విభాగంలో ఎలాంటి ఖాళీలు చూపకపోవడం శోచనీయం. అనేక సందర్భాలలో ప్రభుత్వ పెద్దలు ఎన్నో వేదికలపై క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడం తప్ప, ఆచరణలో మాత్రం అది కనిపించలేదు.
ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పీఈటీ పోస్టులను, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలలకు పీడీ పోస్టులు కొత్త డీఎస్సీలో భర్తీ చేయాలి. దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోని పీడీ జూనియర్ లెక్చరర్, పీడీ డిగ్రీ లెక్చరర్ పోస్టులనూ మంజూరు చేయాలి. – కె.నరసింహారెడ్డి, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు
ఆ పోస్టులన్నీ ఇప్పుడేవీ?
» ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, గత ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ప్రతిపక్షంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విమర్శించారు. గ్రూప్–1, 2 పోస్టులు 2 వేలు, ఇంజినీరింగ్ పోస్టులు 20 వేలు, టీచర్ పోస్టులు 25 వేల ఖాళీలు ఉన్నాయని ప్రచా రం చేశారు. కానీ ఇప్పుడు అతి స్వల్పంగానే పోస్టు లను ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.
» గతేడాది ఆగస్టు 31 నాటికి హోం శాఖలో 11,639 పోస్టులు వివిధ కేడర్‌లో ఖాళీలు ఉన్నట్టు డీజీపీ కార్యాలయం హోం శాఖ ముఖ్య కార్యదర్శికి వివరాలు అందించింది. ఈ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. నిర్ణీత గడువులోగా పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించింది.

» అయితే తాజా క్యాలెండర్‌లో హోంశాఖలో 2,778 పోస్టులను మాత్రమే చూపారు. మరి మిగిలిన 10 వేల పోస్టులు ఆరు నెలల కాలంలో ఎక్కడికిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం 2024 జూన్ 12న డీఎస్సీపై తొలి సంతకం చేశారు. సగానికి సగం పోస్టులు దాచేసి ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ నిర్వహించారు.
» గతంలో పాఠశాల విద్యా శాఖలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రచారం చేసినవారు ప్రస్తుత క్యాలెండర్‌లో పాఠశాల విద్య, ఇంటర్ విద్యలో కేవలం 3,004 పోస్టులు ప్రకటించడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఈ–2009 చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో స్పెషల్ టీచర్ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు 2,500 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని 2024లోనే ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం
» గ్రామ, పట్టణ ప్రజలకు వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. నిర్వహణ కోసం 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను నాశనం చేయడం ప్రారంభించింది.

» దాదాపు 30 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల్లో డెప్యుటేషన్‌పై తరలించారు. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా వివిధ శాఖల్లో విలీనం చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగులకు అడహక్ పదోన్నతులు కల్పిస్తూ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మోసమేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్క డీఎస్సీ నిర్వహణనే ఏడాదిన్నర కాలం సాగదీసిన కూటమి ప్రభుత్వం ఈ పోస్టుల నోటిఫికేషన్లు ఇవ్వడం నుంచి పోస్టుల భర్తీ వరకు భంగపాటు తప్పదని చెబుతున్నారు.
» గత ప్రభుత్వం ఉన్నత విద్యలో యూనివర్సిటీల్లో 3,220 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల నెపంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి, కేవలం 1,500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం మోసమే.


