తీరు మారుస్తూ.. సుప్రీం ‘తీర్పు’! | Concern over Extraordinary Delay by High Courts in Pronouncing Judgments | Sakshi
Sakshi News home page

తీరు మారుస్తూ.. సుప్రీం ‘తీర్పు’!

Mar 20 2026 3:22 AM | Updated on Mar 20 2026 3:22 AM

Concern over Extraordinary Delay by High Courts in Pronouncing Judgments

తీర్పుల వెలువరింతలో హైకోర్టుల అసాధారణ జాప్యంపై ఆందోళన

దేశంలోని అన్ని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు

సాక్షి, అమరావతి: న్యాయాన్ని అందించడంలో జాప్యం జరిగితే.. అది న్యాయాన్ని తిరస్కరించడమే..!
న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కూడా కనిపించాలి..!
ఇవి న్యాయ వ్యవస్థలో రూఢీ అయిన సూత్రాలు. అయితే కక్షిదారులకు న్యాయం అందించే విషయంలో దేశంలోని హైకోర్టుల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంపై స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హైకోర్టుల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసిన నాటి నుంచి తీర్పు వెలువరించేంత వరకు జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తీర్పులను వెలువరించేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తాజాగా దేశంలోని అన్ని హైకోర్టులకు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఇకపై ఏదైనా కేసులో వాదనలు విన్న తరువాత ఆ కేసులో తీర్పును ఎప్పుడు రిజర్వ్‌ చేశారు..? ఆ తరువాత తీర్పును ఎప్పుడు వెలువరించారు..? ఆ తీర్పు కాపీని ఎప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు..? అనే వివరాలను తేదీలతో సహా తీర్పు కాపీపై స్పష్టంగా ముద్రించాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తద్వారా ఆ కేసులో ఎప్పుడు ఏం జరిగిందని అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తీర్పులు వెలువరించే విషయంలో వేగం కూడా పెరగనుంది.

విప్లవాత్మక సంస్కరణ అంటున్న న్యాయ నిపుణులు..
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలను న్యాయవ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనివల్ల న్యా­య­­వ్యవస్థలో పారదర్శకత, తీర్పు­లు ఇచ్చే విషయంలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఇకపై సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుండా ఉండేందుకు అవకాశం ఉండదు. 

ఒకవేళ అలా సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుంటే.. చివరకు తీర్పు వెలువరించిన సమయంలో ఆ వివరాలను అందులో ప్రస్తావించాల్సి ఉంటుంది. దీంతో జాప్యంపై ఎవరో ఒకరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తీర్పు వెలువరించే విషయంలో న్యాయమూర్తులకు చట్టపరంగా నిర్దిష్ట గడువంటూ ఏదీ లేదు. అయితే తీర్పు రిజర్వ్‌ చేసిన తర్వాత ఆరు నెలల్లోపు తీర్పు వెలువడటం ఓ సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి 2001లో అనిల్‌రాయ్‌ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. తీర్పు రిజర్వ్‌ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లో తీర్పు వెలువరించాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు అన్నీ హైకోర్టులను ఆదేశించింది.

ఇప్పటికే గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు...
అలాగే కొన్ని హైకోర్టుల్లో తీర్పులు వెలువరించిన తరువాత అవి అందుబాటులోకి రావడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు తీర్పు కాపీలు బయటకు వచ్చేందుకు నెలల సమయం కూడా పడుతోంది. దీంతో కక్షిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తీర్పులు వెలువరించే విషయంలో నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఓ తీర్పునిచ్చింది.

ఏదైనా కేసులో తీర్పు రిజర్వ్‌ చేసిన తరువాత 3 నెలల్లోపు తీర్పు వెలువరించకుంటే ఈ విషయాన్ని సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తేవాలని ఆదేశించింది. అనంతరం సీజే.. ఆ విషయాన్ని సదరు న్యాయమూర్తి, ధర్మాసనం దృష్టికి తెచ్చి రెండు వారాల్లో తీర్పునివ్వాల్సిందిగా కోరాలని సూచించింది. ఆ రెండు వారాల్లో కూడా తీర్పు వెలువరించకుంటే, ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును మరో న్యాయమూర్తికి, ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు లోపు తీర్పు వెలువరించకుంటే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేయాలి, కక్షిదారులు ఏం చేయాలన్న దానిని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.

సుప్రీం.. తీవ్ర విస్మయం 
తమకు కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై తీర్పును రిజర్వ్‌ చేసిన జార్ఖండ్‌ హైకోర్టు రెండు మూడేళ్లుగా తీర్పు వెలువరించలేదంటూ కొందరు ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు రిజర్వు చేసి రెండేళ్లయినా కూడా తీర్పు వెలువరించకపోవడంపై ధర్మాసనం తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తూ దేశంలోని అన్ని హైకోర్టుల నుంచి నివేదికలు కోరింది. 

తీర్పులు వెలువరించడంలో జాప్యం చేయడం కక్షిదారుల హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. హైకోర్టులకు తగిన దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించింది. తమ ముందున్న కేసుల్లో తీర్పులు వెలువరించేందుకు ఎంత కాలం పడుతుందో ప్రజలందరికీ తెలియచేసేందుకు వీలుగా ఆ వివరాలను తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొనాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు కేవలం కాగితాలకే మాత్రమే పరిమితం కాకూడదని, ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచేలా ఆ సంస్కరణలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం ఆదేశాల అమలుకు రాష్ట్ర హైకోర్టు శ్రీకారం..
సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఏపీ హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రతి తీర్పు సర్టిఫైడ్‌ కాపీతో పాటు అప్‌లోడ్‌ చేసిన కాపీలోనూ తీర్పును ఎప్పుడు రిజర్వ్‌ చేశారు.. ఎప్పుడు తీర్పు వెలువరించారు.. ఎప్పుడు ఆ తీర్పును అప్‌లోడ్‌ చేశారు.. లాంటి వివరాలను తీర్పు మొదటి పేజీలో స్పష్టంగా పేర్కొనాలని హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా న్యాయమూర్తుల కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు చర్యలు చేపట్టారు. దీంతో తీర్పులు సకాలంలో అప్‌లోడ్‌ అవుతూ కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.

ఆ వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది..
‘ఏ న్యాయమూర్తి ఎప్పుడు తీర్పు రిజర్వ్‌ చేశారు? ఎంత కాలం తర్వాత తీర్పు ఇచ్చారు? ఆ తీర్పు కక్షిదారులకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? తీర్పులను వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయడానికి హైకోర్టులు ఎంత సమయం తీసుకుంటున్నాయి? లాంటి వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టంగా పేర్కొన్నారు. తీర్పుల రిజర్వ్, తీర్పు వెలువడిన తేదీలను మాత్రమే చూపే ఒక ప్రత్యేక డాష్‌బోర్డ్‌ హైకోర్టు వెబ్‌సైట్లలో ఉండాలని జస్టిస్‌ బాగ్చీ అభిప్రాయపడ్డారు.

ఏడాదికి కూడా వెలువడని తీర్పులు
అయితే ఈ ఆదేశాలు పలు హైకోర్టుల్లో అమలు కావడం లేదు. వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన తరువాత ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని పలు ఉదంతాలు ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. కొన్ని హైకోర్టులు తీర్పు రిజర్వ్‌ చేసిన రెండేళ్లకు కూడా తీర్పులు వెలువరించకపోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. 

తీర్పులు వెలువరించడంలో అసాధారణ జాప్యం చేసినందుకు కొందరు న్యాయమూర్తులను సైతం సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దక్షిణాదిలోని ఓ హైకోర్టులో న్యాయమూర్తి ఒకరు దాదాపు 700 కేసుల్లో ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని కారణంతో సుప్రీంకోర్టు ఆయన్ను బదిలీ చేసింది. సకాలంలో తీర్పులు వెలువరించాలన్న విషయంలో సుప్రీంకోర్టు వైఖరి చాలా స్పష్టంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement