బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 173 (3) ఇదే విషయం స్పష్టం చేస్తోంది
యాంత్రికంగా ఎఫ్‌ఐఆర్ నమోదును నిరోధించడమే ఈ సెక్షన్ ఉద్దేశం
ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరపాలి
ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు యాంత్రికమే అవుతుంది.. అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదు
ఈ అంశాలను పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు
సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా పోలీసులు అడ్డగోలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో కేసు నమోదుకు ముందే 14 రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి, నేరం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయితేనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 173(3) చెబుతోందన్న సుప్రీంకోర్టు, పోలీసులు ఈ సెక్షన్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ తప్పుపట్టింది. వేధింపులు లేదా నిరాధారమైన ఆరోపణలతో క్రిమినల్ చర్యలు ప్రారంభించకుండా అడ్డుకోవడమే ప్రాథమిక విచారణ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేసింది.
ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం యాంత్రికంగా వ్యవహరించడమే అవుతుందని స్పష్టం చేసింది. అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఫిర్యాదు అందిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా యాంత్రికంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా పోలీసులను నిరోధించడమే శాసనకర్తల ముఖ్య ఉద్దేశమని, అందుకే బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 173 (3) తీసుకొచ్చారని గుర్తు చేసింది.
హైకోర్టులు ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయచ్చు..
భజన్ లాల్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆరోపణలు అసంబద్ధంగా, అస్పష్టంగా ఉన్నప్పుడు హైకోర్టులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 528 కింద తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి కేసును కొట్టేయవచ్చునని సుప్రీంకోర్టు తెలపింది. ఓ మీడియా సంస్థ తన సంస్థలో పనిచేసిన ఉద్యోగిపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైపూర్ సిటీ, అశోక్ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది. అస్పష్టమైన ఆరోపణలతో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, అందుకే కేసును కొట్టేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఫిర్యాదులోని ఆరోపణలు చాలా అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. అధికార దుర్వినియోగం, అక్రమాలు తదితర ఆరోపణలు ఉన్నప్పటికీ, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను సమర్పించలేదంది. పోలీసులు సైతం ప్రాథమిక విచారణ జరపకుండా, ఆరోపణలను దృవీకరించుకోకుండానే చాలా వేగంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఇది ఆశ్చర్యకరంగా ఉందని ధర్మాసనం ఆక్షేపించింది.
ఎఫ్‌ఐఆర్ అనేది ఎన్‌సైక్లోపిడియా కానప్పటికీ, అందులో ప్రాథమిక వాస్తవాలు ఉండాలని తెలిపింది. సామాన్యుడు ఎవరైనా ఇలాంటి ఆరోపణలతో ఫిర్యాదు చేసి ఉంటే పోలీసులు కేసు నమోదు చేసి ఉండే వారు కాదని, అయితే ప్రముఖ మీడియా సంస్థ కావడంతో ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారని తెలిపింది.


