breaking news
Preliminary Inquiry
-
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్‌లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
ప్రాథమిక విచారణ లేకుండా అరెస్టులు వద్దు
వరకట్న వేధింపుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ: వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణ చేయకుండా, ఆరోపణలు నిజమో కాదో కనీసం సరిచూడకుండానే ఏ తప్పూ చేయనివారిని అరెస్టు చేయడం తగదంది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని సందర్భాల్లో అమాయకుల హక్కులను హరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోకుండా, అనవసరంగా అరెస్టులు చేస్తే...ఆ తర్వాత వివాదం పరిష్కారం అయ్యేందుకు ఉన్న మార్గాలు కూడా మూసుకుపోయే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498–ఏ (మెట్టినింట్లో మహిళకు వేధింపులు) కింద వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పలు మార్గదర్శకాలు, సూచనలను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం జారీచేసింది. కుటుంబ సంక్షేమ కమిటీల ఏర్పాటు! వరకట్న వేధింపుల కేసులను విచారించేందుకు ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ‘498–ఏ కింద వచ్చిన ప్రతి ఫిర్యాదును పోలీసులు లేదా న్యాయాధికారులు ముందుగా ఈ కమిటీలకే పంపాలి. ఫిర్యాదు అందాక కమిటీలు కేసును ప్రాథమికంగా విచారించి గరిష్టంగా నెల రోజుల్లోపే నివేదికను సిద్ధం చేయాలి. ఆ నివేదికలోని అంశాలను బట్టే పోలీసులు అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలి. అంతకు ముందే ఎలాంటి అరెస్టులూ ఉండరాదు. అయితే మహిళపై భౌతిక దాడులు చేసినప్పుడు, ఆమె ఒంటిపై గాయాలున్నప్పుడు ఈ మార్గదర్శకాలకు కట్టుబడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. అలాగే ఇలాంటి కేసులను సంబంధిత అనుమతులు ఉన్న అధికారులు మాత్రమే విచారించాలని సూచించింది. ఒకవేళ ఫిర్యాదులో పేర్కొన్న నిందితుడు భారత్‌కు వెలుపల నివసిస్తోంటే, అలాంటివారి పాస్‌పోర్టులను నివేదిక రాకముందే సస్పెండ్ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయడం వంటి చర్యలకు దిగకూడదని కోర్టు పేర్కొంది. కుటుంబ సంక్షేమ కమిటీలను జిల్లా న్యాయసేవల అధికార సంస్థలు నియమించాలని వ్యాఖ్యానించింది. కమిటీల పనితీరును జిల్లా జడ్జి లేదా, సెషన్స్ జడ్జి కనీసం ఏడాదికి ఒకసారైనా సమీక్షించాలంది.