గుట్టుచప్పుడు కాకుండా ఎగుమతులు
మత్స్యకారుల రూపంలో వేటాడుతున్న దళారులు
విశాఖ నుంచి చెన్నైకు షార్క్ చేపల భాగాలు
అక్కడి నుంచి సింగపూర్, మలేసియాకు ఎగుమతులు
ఎగుమతులపై నిషేధాన్ని పట్టించుకోని దళారులు
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ, విశాఖ ఫిషింగ్ హార్బర్ సాక్షిగా అరుదైన షార్క్ భారీ అక్రమ రవాణా సాగుతోంది. అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న షార్క్ ఫిన్స్ (మొప్పలు) కోసం మత్స్యకారుల రూపంలో వేటగాళ్లు సాగర గర్భాన్ని జల్లెడ పడుతున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని కోట్లాది రూపాయలకు విదేశాలకు తరలిస్తున్నారు. షార్క్‌ల అక్రమ రవాణా అరికట్టకపోతే ఇందులో పలు జాతులు అంతరించే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత ప్రభుత్వం షార్క్‌ల వేటను ‘టైగర్æ’ వేటతో సమానంగా పరిగణిస్తున్నా, విశాఖ తీరంలో మాత్రం చట్టం చుట్టంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ చట్టం (1972) ప్రకారం షార్క్‌ల వేటను, ఎగుమతిని కఠినతరం చేసింది. ముఖ్యంగా 2001లో షార్క్‌లోని కొన్ని అరుదైన జాతులను షెడ్యూల్–1 జాబితాలో చేర్చడం ద్వారా వీటి వేటను పూర్తిగా నిషేధించింది.
మత్స్యకారులకు బెదిరింపులు
విశాఖ హార్బర్‌లో వేటకు వెళ్లే మత్స్యకారుల అమాయకత్వాన్ని కూడా దళారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పొరపాటున వలకు చిక్కిన షార్క్‌లను చూపి ‘వీటిని విక్రయించడం నేరం, పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది‘ అని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ భయంలో మత్స్యకారులు వాటిని వదిలించుకోవాలని చూసినప్పుడు, దళారులు అతి త క్కువ ధర చెల్లించి వాటిని కొనుగోలు చేస్తారని సమాచారం.
మరికొంతమంది దళారులు ఏకంగా మత్స్యకారుల అవతారమెత్తి.. షార్క్‌ల వేట చేస్తున్నారనే విమర్శలున్నాయి. బయట మార్కెట్లో లక్షల విలువ చేసే షార్క్‌ల విడిభాగాలు, మత్స్యకారుల చేతుల్లో కేవలం కొన్ని వందల రూపాయిలకే దళారుల పరమవుతున్నాయి.
అక్రమ రవాణా మార్గం
విశాఖ హార్బర్‌లో దొరికిన షార్క్‌లను హార్బర్‌లోనే రహస్య ప్రాంతాలకు తరలిస్తారని తెలుస్తోంది. అక్కడ నిపుణులైన వ్యక్తులతో ఫిన్స్, కాలేయాన్ని, ఇతర భాగాలను వేరు చేస్తారు. వీటిని ఐస్ బాక్సుల్లో భద్రపరిచి, రవాణా వాహనాల్లో చేపల లోడ్ మధ్యలో దాచి పెడుతున్నట్లు సమాచారం. స్మగ్లర్లు మల్టీలేయర్ రవాణా పద్ధతిలో చిన్న చిన్న ఐస్ బాక్సుల్లో దాచి.. ప్రైవేట్ బస్సుల ద్వారా చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖ నుంచి ఇవి నేరుగా చెన్నైకి చేరుతాయి. అక్కడి నుంచి సముద్ర మార్గం లేదా విమానాల ద్వారా చైనా, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, హాంగ్‌కాంగ్ తదితర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయని నిఘా వర్గాల సమాచారం.
అధికారుల నిర్లక్ష్యం
ఈ అక్రమ రవాణా అంతా మత్స్యశాఖ అధికారుల కళ్లముందే జరుగుతున్నా, వారు కనీసం తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు కింది స్థాయి సిబ్బందికి దళారులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయనీ.. అందుకే అక్రమ రవాణా వాహనాలు యథేచ్ఛగా వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా ‘సాంకేతిక కారణాలు’ సాకుతో కాలయాపన చేస్తున్నారే తప్ప, గట్టి నిఘా పెట్టిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి.
కేవలం విశాఖలోనే కాకుండా దేశవ్యాప్తంగా.. అనేక సముద్ర తీర ప్రాంతాల్లో షార్క్‌ల వేట సాగుతోంది. వరల్డ్‌వైడ్ ఫండ్–ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఐ), ట్రాఫిక్ సంస్థల నివేదిక ప్రకారం.. భారత దేశ వ్యాప్తంగా గడిచిన దశాబ్ద కాలంలో 18,000 కిలోల షార్క్ ఫిన్స్‌ని దళారుల నుంచి స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో ఫిన్స్ వాటా 82 శాతం కాగా.. మిగిలిన 18 శాతంలో షార్క్ దంతాలు, కార్టిలేజ్(మృదులాస్థి), చర్మం ఉన్నాయి. 2025 జనవరిలో విశాఖ తీరానికి సమీపంలో అక్రమంగా సేకరించిన షార్క్‌ఫిన్స్‌ని తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.
సముద్ర పర్యావరణానికి విఘాతం
» సముద్ర ఆహార గొలుసులో షార్క్‌లు అగ్రస్థానంలో ఉంటాయి.
» ఇవి చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న జీవులను తిని సముద్రాన్ని శుభ్రంగా ఉంచుతాయి.
» వీటి సంఖ్య తగ్గితే సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
» షార్క్‌లు చాలా నెమ్మదిగా ఎదుగుతాయి.
» తక్కువ పిల్లలకు జన్మనిస్తాయి.
» విచ్ఛలవిడి వేట వల్ల ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.
భారీ డిమాండ్
» షార్క్‌లోని ప్రతి భాగం అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో సమానం.
»ముఖ్యంగా ‘షార్క్‌ఫిన్స్’ (మొప్పలు) కోసం వీటిని వేటాడుతుంటారు.
»ఎందుకంటే చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో షార్క్ ఫిన్స్‌తో చేసే సూప్ చాలా ఖరీదైనది.
» ఈ సూప్‌ని హోదాకు చిహ్నంగా భావిస్తారు.
»హాంగ్‌కాంగ్‌లో ప్లేట్ ఫిన్ సూప్ ధర రూ.8,500 నుంచి రూ.10,000 వరకూ ఉంటుంది.
» అదేవిధంగా.. షార్క్ కాలేయం నుంచి తీసే నూనెను (స్క్వాలెన్స్) సౌందర్య సాధనాలు, క్యాన్సర్ మందుల తయారీలో ఉపయోగిస్తారు.
» షార్క్ చర్మాన్ని ఖరీదైన లెదర్ వస్తువుల తయారీకి, వెన్నెముక ఎముకలను కొన్ని రకాల చీలమండ నొప్పుల మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు.
» అంతర్జాతీయ మార్కెట్లో ఒక కిలో ఎండిన షార్క్ ఫిన్స్ ధర నాణ్యతను బట్టి రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది.
» షార్క్‌లలో హ్యామర్‌హెడ్, గ్రే రీఫ్, వేల్‌షార్క్‌లకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది.
» విశాఖ సాగర జలాల్లో గ్రేరీఫ్ షార్క్, హ్యామర్‌హెడ్, బ్లాక్‌టిప్, బ్లాక్‌టిప్ రీఫ్, స్పాట్‌టైల్, వైట్ చీక్, టైగర్, స్పేడ్‌నోస్, బుల్‌షార్క్ జాతులు ఎక్కువగా దొరుకుతున్నాయి.


