రెండేళ్లుగా అర్హులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరవు గత ప్రభుత్వంలో ‘జగనన్న తోడు’ ద్వారా ఆర్థిక భరోసా ఏటా సున్నా వడ్డీకే రూ.10 వేలు అందించి తోడ్పాటు నేడు కూలీలుగా మారుతున్న చిరువ్యాపారులు చంద్రబాబు ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు మొండిచెయ్యి చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక చిరువ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. అన్ని వర్గాల ప్రజలతో పాటు వీరు కూడా ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు.. గద్దెనెక్కాక ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణ సాయం అందేది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేయడంతో పేద ప్రజలకు ఆర్థిక భరోసా కరవై.. వారి జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి.
సబ్బవరం: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో రోడ్ల పక్కన, ప్రధాన కూడళ్లలోని బహిరంగ ప్రదేశాల్లో తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీలపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు చాలా మంది ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 248 డ్వాక్రా సంఘాల్లోని అర్హులైన 450 మందికి ఏటా రూ.10 వేలు చొప్పున జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీలేని రుణ సాయం రూ.45 లక్షలు అందేది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా స్వయం ఉపాధి రుణాలు నిలిపేసింది. దీంతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్వయం ఉపాధికి తూట్లు
బహరంగ ప్రదేశాలు, రోడ్లు, వీధుల్లో తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, నెత్తిన గంపలతో ఇంటింటికీ తిరిగి పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిల్లర వర్తకులకు గత ప్రభుత్వంలో ఆర్థిక ఆసరా ఉండేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరు ఆశించిన మేర లేదు. దీంతో అర్హులు స్వయం ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు.
చిరువ్యాపారాలతో ఉపాధి పొందే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వారి జీవన పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా మారాయి. కొంత మంది చిన్నచిన్న వ్యాపారాలను వదిలేసి కుటుంబ పోషణ కోసం కూలీల అవతారం ఎత్తుతున్నారు.
గత ప్రభుత్వంలో సున్నా వడ్డీకే రూ.10 వేలు
గత ప్రభుత్వంలో జగనన్న తోడు పథకం ద్వారా గ్రామాల్లోని చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత అందేది. వలంటీర్ల ద్వారా అర్హులను గుర్తించి ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే రూ.10 వేలు అందించేది. బ్యాంకుల నుంచి లబి్ధదారుడు తీసుకున్న రుణానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లించేది.
ఇలా గత ప్రభుత్వంలో అందిన ఆర్థిక భరోసాతో చాలా మంది చిరు వర్తకులు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకునేవారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కనీస చొరవ కూడా చూపకపోవడంతో వీరంతా ఎప్పటిలానే వడ్డీ వ్యాపారులు, రోజువారీ ఫైనాన్స్ ఇచ్చేవారి బారిన పడి, అధిక వడ్డీలతో కుదేలవుతున్నారు.
ఆ పథకం అమలు చేయాలి
నేను శ్రీదుర్గసాయి గ్రూప్ సభ్యురాలిని. సబ్బవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గాయత్రీ టీనేజ్ పాయింట్ అనే చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నా. జగనన్న ప్రభుత్వం అమలు చేసిన జగనన్న తోడు పథకం ద్వారా రూ.10 వేలు ఆర్థిక సాయం అందింది. నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తూ తీసుకున్న రుణాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించాను. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆ పథకం అమలు చేస్తే బాగుండు. – గెడ్డం సూర్యకుమారి, బడ్డీకొట్టు వ్యాపారి, గెడ్డం వీధి


