
తమిళ నటుడు పొన్నాంబళం.. తెలుగులో ఘరానా మొగుడు (1992)లో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పాందారు. ముఖ్యంగా ప్రతి నాయకుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. తమిళంలో రజనీకాంత్ , కమలహాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ,నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించాడు. అలాంటి నటుడు ఇటీవల అనారోగ్యానికి గురై కఠినమైన వైద్య చికిత్సలు పొందుతున్నారు.
ముఖ్యంగా మూత్రపిండాల సమస్యను ఎదుర్కొన్న పొన్నాంబళం వైద్య చికిత్సలకు కూడా డబ్బు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. దీంతో సహాయం కోసం అభ్యర్థించడంతో పలువురు నటులు ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు. ముఖ్యంగా చిరంజీవి, రాధిక శరత్ కుమార్, ధనుష్ , రజనీకాంత్ వంటి స్టార్స్ పొన్నాంబళం వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. కాగా పొన్నాంబళం ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నాలుగేళ్లలో 750కి పైగా ఇంజెక్షన్లు చేయించుకున్నట్లు చెప్పారు. రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి తన ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారని చెప్పారు.
తనకు వచ్చిన ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. తను ఎక్కువగా మద్యం సేవించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెప్పారన్నారు. అయితే, చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం ఆపేశానన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్ని వాపోయారు. అయితే మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నానని, ఆ సమయంలో చాలా బాధ అనుభవించానని పొన్నంబళం పేర్కొన్నారు. మద్యం ఎప్పటికీ హనికరం అంటూ జీవితంలో తాను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఆయన అభ్యర్థించారు.