రిటర్నులకు వేళాయెనే..! | Explanations of Filing of income tax returns, sakshi special story | Sakshi
Sakshi News home page

రిటర్నులకు వేళాయెనే..!

Jul 28 2025 4:58 AM | Updated on Jul 28 2025 12:36 PM

Explanations of Filing of income tax returns, sakshi special story

పన్ను చెల్లింపులతో సంబంధం లేదు.. 

టీడీఎస్‌ రూ.25 వేలు దాటితే తప్పదు 

విదేశాల్లో ఆస్తులను వెల్లడించాల్సిందే.. 

అధిక విలువ లావాదేవీలకూ తప్పనిసరి 

అన్‌లిస్టెడ్‌ షేర్లు కలిగి ఉన్నా రిటర్నులు వేయాల్సిందే..

వేతన జీవుల్లో చాలా మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తుంటారు. చిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు, కొన్ని రకాల వృత్తి నిపుణులు మాత్రం దూరంగా ఉండడం గమనించొచ్చు. పైగా రిటర్నులు వేయడం కేవలం ఉద్యోగులు, వ్యాపారులకు సంబంధించిన విషయమేనని కొందరు భావిస్తుంటారు. అసలు ఆదాయపన్ను రిటర్నులు ఎవరు దాఖలు చేయాలి..? పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోయినా సరే.. రిటర్నులు దాఖలు చేయాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులు, విశ్రాంత జీవులు, రైతులు, చివరికి గృహిణులు సైతం నిబంధనల ప్రకారం రిటర్నులు వేయాల్సిందే. ఎప్పుడు ఎలా అన్న విషయమై అవగాహన కల్పించే ప్రయత్నమే ఇది.       

2024–25 ఆర్థిక సంవత్సరానికి (2025–26 అసెస్‌మెంట్‌ సంవత్సరం) ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు సెపె్టంబర్‌ 15 వరకు గడువు ఉంది. వాస్తవ గడువు జూలై 31 కాగా, కొన్ని సాంకేతిక అంశాల కారణంగా గడువును పెంచుతూ ఆదాయపన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. అధిక ఆదాయ పరిధిలో ఉన్న వారే రిటర్నులు వేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది పొరపాటు. పన్ను చెల్లించాల్సిన అదాయం లేకపోయినా సరే చట్టంలోని నిబంధనల ప్రకారం పన్ను రిటర్నులు వేయాల్సి రావచ్చు. పైగా రిటర్నులు సమర్పించడం మంచి సంప్రదాయం కిందకు వస్తుంది.  

పరిమితులు.. 
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం బేసిక్‌ ఎగ్జెంప్షన్‌ (ప్రాథమిక మినహాయింపు) పరిమితి దాటినట్టయితే రిటర్నులు (ఐటీఆర్‌) తప్పనిసరిగా దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. పాత పన్ను విధానంలో 60 ఏళ్లు దాటని వారికి రూ.2,50,000 ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిగా ఉంది. 60–80 ఏళ్ల మధ్యవయసు వారికి రూ.3,00,000, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5,00,000 పరిమితి అమల్లో ఉంది. కొత్త విధానం కింద అన్ని వయసుల వారికి ఈ పరిమితి రూ.3,00,000గా ఉంది. ఆదాయం ఈ పరిమితికి మించకపోతే సాధారణంగా ఐటీఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరి కాదు. కానీ, ఆదాయం ఈ పరిమితుల్లోనే ఉన్నా కానీ, పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి.  

ఐటీఆర్‌ వేయాల్సిందే.. 
‘‘నేను ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కనుక నేను ఎందుకు రిటర్నులు వేయాలి?’’ చాలా మంది ఇలానే భావిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం.. స్థూల ఆదాయం పైన చెప్పుకున్న పరిమితులను దాటితే తప్పకుండా రిటర్నులు వేయాల్సిందే. చట్టంలో కల్పించిన రాయితీలు, మినహాయింపుల ప్రకారం ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేకపోయినా సరే.. రిటర్నులు సమర్పించడం ద్వారానే వాటిని క్లెయిమ్‌ చేసుకుని, ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిటర్నులు దాఖలు చేయకపోతే మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకునే హక్కును కోల్పోతారు.  

→ ఉదాహరణకు రవివర్మ వార్షిక ఆదాయం రూ.2.4 లక్షలు. పింఛను, బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఈ మొత్తం సమకూరింది. కానీ, వడ్డీ ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ కింద బ్యాంక్‌ మినహాయించింది. ఈ కేసులో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కానీ, బ్యాంక్‌ నుంచి ఆదాయపన్ను శాఖకు వెళ్లిన టీడీఎస్‌ మొత్తాన్ని తిరిగి పొందాలంటే (రిఫండ్‌) రిటర్నులను నిరీ్ణత గడువులోపు సమర్పించడం ద్వారానే సాధ్యపడుతుంది.  
→ ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరం పరిధిలో తమ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.50 లక్షలకు మించి డిపాజిట్‌ చేస్తే తప్పకుండా ఐటీఆర్‌ దాఖలు చేయాలి.  
→ ఒకటి లేదా ఒకటికి మించిన కరెంట్‌ ఖాతాలలో కలిపి (వాణిజ్య, కోపరేటివ్‌ బ్యాంకుల) రూ.కోటి, అంతకు మించి డిపాజిట్‌ చేస్తే రిటర్నులు సమర్పించాలి. వ్యక్తులకే గానీ వ్యాపార సంస్థలకు ఈ నిబంధన వర్తించదు.  
→ ఏడాదిలో అమ్మకాల ఆదాయం గనుక రూ.60 లక్షలు మించితే వ్యాపార సంస్థలు రిటర్నులు వేయాలి.  
→ వృత్తి ద్వారా ఆదాయం రూ.10 లక్షలకు మించినప్పుడు రిటర్నులు దాఖలు చేయాలి.  
→ ఒక విద్యుత్‌ బిల్లు రూ.లక్ష మించినా లేదా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విద్యుత్‌ బిల్లు రూ.లక్షకు మించిన సందర్భంలోనూ పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.  
→ వివిధ రూపాల్లో టీడీఎస్‌ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000, అంతకు మించి ఉంటే అప్పుడు కూడా రిటర్నులు వేయాల్సిందే. 
60 ఏళ్లు నిండిన వారికి ఈ పరిమితి రూ.50,000గా ఉంది.  
→ విదేశీ ఆస్తుల సమాచారాన్ని ఐటీఆర్‌లోని షెడ్యూల్‌ ఎఫ్‌ఏ కింద తప్పకుండా వెల్లడించాలి. విదేశీ ఖాతాకు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు సైతం రిటర్నులు వేయాల్సిందే. భార్యా, భర్తలు సంయుక్తంగా విదేశాల్లో ఆస్తికి యజమానులుగా ఉంటే అప్పుడు ఇద్దరూ విడిగా రిటర్నులు దాఖలు చేసి, ఆస్తి వివరాలు వెల్లడించాలి.  
→ విదేశీ కంపెనీల షేర్లను కలిగి వారు సైతం రిటర్నులు ద్వారా ఆ వివరాలు వెల్లడించాలి.  
→ దేశీయ అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో వాటాలు (షేర్లు) కలిగిన వారు కూడా రిటర్నులు దాఖలు చేసి వెల్లడించాలి.  
→ ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనలపై (తనకోసం, ఇతరుల కోసం) చేసిన ఖర్చు రూ.2 లక్షలకు మించినట్టయితే పన్ను రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి. 
→ మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాలని అనుకుంటే సెక్షన్‌ 139(3) కింద గడువులోపు రిటర్నులు వేయడం తప్పనిసరి. సెక్షన్‌ 54, 54బి, 54ఈసీ లేదా 54 ఎఫ్‌ కింద మూలధన నష్టాలపై మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవడం రిటర్నుల దాఖలుతోనే సాధ్యపడుతుంది.  
→ సెక్షన్‌ 10(1) కింద వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. వ్యవసాయంపై ఆదాయానికి అదనంగా.. వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే అప్పుడు రిటర్నులు సమర్పించాల్సిందే.

ప్రయోజనాలు..
పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పాస్‌పోర్ట్‌గా పన్ను రిటర్నులు పనిచేస్తాయి. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో బ్యాంక్‌ ఐటీఆర్‌ కాపీ కోరొచ్చు. తిరిగి చెల్లించే సామర్థ్యానికి ఐటీఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. టీడీఎస్‌లను తిరిగి పొందేందుకు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్‌ చేసుకుని, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు ఐటీఆర్‌ దాఖలు వీలు కల్పిస్తుంది. 

ముఖ్యంగా యూఎస్, యూకే, షెంజెన్‌ దేశాలకు (29 యూరప్‌ దేశాల సమూహం), కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే క్రితం 2–3 సంవత్సరాలకు సంబంధించి పన్ను రిటర్నుల కాపీలను సమర్పించాల్సి వస్తుంది. లేదంటే దరఖాస్తును తిరస్కరించొచ్చు. ముఖ్యంగా స్వయం ఉపాధిలో ఉన్న వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి ఆదాయ రుజువులు ఉండవు. వీరికి ఐటీఆర్‌ ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఇలాంటి వారు రుణం, టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి ఐటీఆర్‌ కాపీని సమర్పిస్తే  సరిపోతుంది. స్టార్టప్‌లు, వ్యాపారాల నమోదు సమయంలో గత కాలపు ఐటీఆర్‌లు మంచి ఆధారంగా పనికొస్తాయి.  

చట్టపరమైన చర్యలకు బాధ్యులు..
విదేశాల్లో బ్యాంక్‌ ఖాతాలు, పెట్టుబడులు, ఈ–సాప్‌లు, స్థిరాస్తులను కలిగిన వారు ఆదాయంతో సంబంధం లేకుండా తప్పకుండా వెల్లడించాల్సిందే. లేదంటే బ్లాక్‌ మనీ అండ్‌ ఇంపోజిషన్‌ యాక్ట్‌ కింద పెనాల్టీలు పడతాయి. అవసరమైతే విచారణను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలు సంయుక్త వెల్లడి ప్రమాణాలను (సీఆర్‌ఎస్‌) అమలు చేస్తున్నాయి. దీనికింద సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. విదేశీ ఆస్తుల సమాచారం పన్ను అధికారులకు తెలియదని అనుకోవడం పొరపాటే అవుతుంది. 

నిబంధల ప్రకారం పన్ను రిటర్నులు సమర్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, దాఖలు చేయనట్టు గుర్తిస్తే.. అప్పుడు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. రిటర్నులు దాఖలు చేయాలని కోరుతుంది. అప్పుడు అయినా రిటర్నులు సమర్పించడం ద్వారా తప్పును సరిదిద్దుకోవచ్చు. లేదంటే పెనాల్టీ చార్జీలు, దానిపై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండీ, రిటర్నులు కూడా వేయకపోతే అప్పుడు చట్టం పరిధిలో అసలు పన్నుకు ఎన్నో రెట్ల జరిమానా, జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.  
   
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement