breaking news
Tax bracket
-
రిటర్నులకు వేళాయెనే..!
వేతన జీవుల్లో చాలా మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తుంటారు. చిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు, కొన్ని రకాల వృత్తి నిపుణులు మాత్రం దూరంగా ఉండడం గమనించొచ్చు. పైగా రిటర్నులు వేయడం కేవలం ఉద్యోగులు, వ్యాపారులకు సంబంధించిన విషయమేనని కొందరు భావిస్తుంటారు. అసలు ఆదాయపన్ను రిటర్నులు ఎవరు దాఖలు చేయాలి..? పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోయినా సరే.. రిటర్నులు దాఖలు చేయాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులు, విశ్రాంత జీవులు, రైతులు, చివరికి గృహిణులు సైతం నిబంధనల ప్రకారం రిటర్నులు వేయాల్సిందే. ఎప్పుడు ఎలా అన్న విషయమై అవగాహన కల్పించే ప్రయత్నమే ఇది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి (2025–26 అసెస్మెంట్ సంవత్సరం) ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు సెపె్టంబర్ 15 వరకు గడువు ఉంది. వాస్తవ గడువు జూలై 31 కాగా, కొన్ని సాంకేతిక అంశాల కారణంగా గడువును పెంచుతూ ఆదాయపన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. అధిక ఆదాయ పరిధిలో ఉన్న వారే రిటర్నులు వేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది పొరపాటు. పన్ను చెల్లించాల్సిన అదాయం లేకపోయినా సరే చట్టంలోని నిబంధనల ప్రకారం పన్ను రిటర్నులు వేయాల్సి రావచ్చు. పైగా రిటర్నులు సమర్పించడం మంచి సంప్రదాయం కిందకు వస్తుంది. పరిమితులు.. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం బేసిక్ ఎగ్జెంప్షన్ (ప్రాథమిక మినహాయింపు) పరిమితి దాటినట్టయితే రిటర్నులు (ఐటీఆర్) తప్పనిసరిగా దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. పాత పన్ను విధానంలో 60 ఏళ్లు దాటని వారికి రూ.2,50,000 ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిగా ఉంది. 60–80 ఏళ్ల మధ్యవయసు వారికి రూ.3,00,000, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5,00,000 పరిమితి అమల్లో ఉంది. కొత్త విధానం కింద అన్ని వయసుల వారికి ఈ పరిమితి రూ.3,00,000గా ఉంది. ఆదాయం ఈ పరిమితికి మించకపోతే సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి కాదు. కానీ, ఆదాయం ఈ పరిమితుల్లోనే ఉన్నా కానీ, పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐటీఆర్ వేయాల్సిందే.. ‘‘నేను ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కనుక నేను ఎందుకు రిటర్నులు వేయాలి?’’ చాలా మంది ఇలానే భావిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం.. స్థూల ఆదాయం పైన చెప్పుకున్న పరిమితులను దాటితే తప్పకుండా రిటర్నులు వేయాల్సిందే. చట్టంలో కల్పించిన రాయితీలు, మినహాయింపుల ప్రకారం ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేకపోయినా సరే.. రిటర్నులు సమర్పించడం ద్వారానే వాటిని క్లెయిమ్ చేసుకుని, ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిటర్నులు దాఖలు చేయకపోతే మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే హక్కును కోల్పోతారు. → ఉదాహరణకు రవివర్మ వార్షిక ఆదాయం రూ.2.4 లక్షలు. పింఛను, బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఈ మొత్తం సమకూరింది. కానీ, వడ్డీ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ కింద బ్యాంక్ మినహాయించింది. ఈ కేసులో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కానీ, బ్యాంక్ నుంచి ఆదాయపన్ను శాఖకు వెళ్లిన టీడీఎస్ మొత్తాన్ని తిరిగి పొందాలంటే (రిఫండ్) రిటర్నులను నిరీ్ణత గడువులోపు సమర్పించడం ద్వారానే సాధ్యపడుతుంది. → ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరం పరిధిలో తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. → ఒకటి లేదా ఒకటికి మించిన కరెంట్ ఖాతాలలో కలిపి (వాణిజ్య, కోపరేటివ్ బ్యాంకుల) రూ.కోటి, అంతకు మించి డిపాజిట్ చేస్తే రిటర్నులు సమర్పించాలి. వ్యక్తులకే గానీ వ్యాపార సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. → ఏడాదిలో అమ్మకాల ఆదాయం గనుక రూ.60 లక్షలు మించితే వ్యాపార సంస్థలు రిటర్నులు వేయాలి. → వృత్తి ద్వారా ఆదాయం రూ.10 లక్షలకు మించినప్పుడు రిటర్నులు దాఖలు చేయాలి. → ఒక విద్యుత్ బిల్లు రూ.లక్ష మించినా లేదా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.లక్షకు మించిన సందర్భంలోనూ పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. → వివిధ రూపాల్లో టీడీఎస్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000, అంతకు మించి ఉంటే అప్పుడు కూడా రిటర్నులు వేయాల్సిందే. 60 ఏళ్లు నిండిన వారికి ఈ పరిమితి రూ.50,000గా ఉంది. → విదేశీ ఆస్తుల సమాచారాన్ని ఐటీఆర్‌లోని షెడ్యూల్ ఎఫ్ఏ కింద తప్పకుండా వెల్లడించాలి. విదేశీ ఖాతాకు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు సైతం రిటర్నులు వేయాల్సిందే. భార్యా, భర్తలు సంయుక్తంగా విదేశాల్లో ఆస్తికి యజమానులుగా ఉంటే అప్పుడు ఇద్దరూ విడిగా రిటర్నులు దాఖలు చేసి, ఆస్తి వివరాలు వెల్లడించాలి. → విదేశీ కంపెనీల షేర్లను కలిగి వారు సైతం రిటర్నులు ద్వారా ఆ వివరాలు వెల్లడించాలి. → దేశీయ అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు (షేర్లు) కలిగిన వారు కూడా రిటర్నులు దాఖలు చేసి వెల్లడించాలి. → ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనలపై (తనకోసం, ఇతరుల కోసం) చేసిన ఖర్చు రూ.2 లక్షలకు మించినట్టయితే పన్ను రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి. → మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాలని అనుకుంటే సెక్షన్ 139(3) కింద గడువులోపు రిటర్నులు వేయడం తప్పనిసరి. సెక్షన్ 54, 54బి, 54ఈసీ లేదా 54 ఎఫ్ కింద మూలధన నష్టాలపై మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడం రిటర్నుల దాఖలుతోనే సాధ్యపడుతుంది. → సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. వ్యవసాయంపై ఆదాయానికి అదనంగా.. వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే అప్పుడు రిటర్నులు సమర్పించాల్సిందే.ప్రయోజనాలు..పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పాస్‌పోర్ట్‌గా పన్ను రిటర్నులు పనిచేస్తాయి. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో బ్యాంక్ ఐటీఆర్ కాపీ కోరొచ్చు. తిరిగి చెల్లించే సామర్థ్యానికి ఐటీఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. టీడీఎస్‌లను తిరిగి పొందేందుకు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు ఐటీఆర్ దాఖలు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా యూఎస్, యూకే, షెంజెన్ దేశాలకు (29 యూరప్ దేశాల సమూహం), కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే క్రితం 2–3 సంవత్సరాలకు సంబంధించి పన్ను రిటర్నుల కాపీలను సమర్పించాల్సి వస్తుంది. లేదంటే దరఖాస్తును తిరస్కరించొచ్చు. ముఖ్యంగా స్వయం ఉపాధిలో ఉన్న వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి ఆదాయ రుజువులు ఉండవు. వీరికి ఐటీఆర్ ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఇలాంటి వారు రుణం, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఐటీఆర్ కాపీని సమర్పిస్తే సరిపోతుంది. స్టార్టప్‌లు, వ్యాపారాల నమోదు సమయంలో గత కాలపు ఐటీఆర్‌లు మంచి ఆధారంగా పనికొస్తాయి. చట్టపరమైన చర్యలకు బాధ్యులు..విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఈ–సాప్లు, స్థిరాస్తులను కలిగిన వారు ఆదాయంతో సంబంధం లేకుండా తప్పకుండా వెల్లడించాల్సిందే. లేదంటే బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ యాక్ట్ కింద పెనాల్టీలు పడతాయి. అవసరమైతే విచారణను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలు సంయుక్త వెల్లడి ప్రమాణాలను (సీఆర్ఎస్) అమలు చేస్తున్నాయి. దీనికింద సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. విదేశీ ఆస్తుల సమాచారం పన్ను అధికారులకు తెలియదని అనుకోవడం పొరపాటే అవుతుంది. నిబంధల ప్రకారం పన్ను రిటర్నులు సమర్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, దాఖలు చేయనట్టు గుర్తిస్తే.. అప్పుడు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. రిటర్నులు దాఖలు చేయాలని కోరుతుంది. అప్పుడు అయినా రిటర్నులు సమర్పించడం ద్వారా తప్పును సరిదిద్దుకోవచ్చు. లేదంటే పెనాల్టీ చార్జీలు, దానిపై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండీ, రిటర్నులు కూడా వేయకపోతే అప్పుడు చట్టం పరిధిలో అసలు పన్నుకు ఎన్నో రెట్ల జరిమానా, జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మూడు టర్మ్ ప్లాన్లు అవసరమేనా?
నేనొక సీనియర్ సిటిజన్‌ను. ఒక జాతీయ బ్యాంక్‌లో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి చేతికొచ్చాయి. వీటిని కనీసం మూడేళ్ల పాటు ఏదైనా డెట్ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు ప్రతి మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం. డివిడెండ్ పేమెంట్ ఆప్షన్, లేదా గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. - సదాశివరావు, విశాఖపట్టణం ఆదాయపు పన్నుకు సంబంధించి మీరు 10 శాతం లేదా 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే, గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా ఇన్వెస్ట్ చేసి ప్రతీ మూడు నెలలకొకసారి నిర్ణీత మొత్తాన్ని రిడీమ్ చేసుకోవాలి. డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే డివిడెండ్లపై 28.84 శాతం చొప్పున డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలలకొకసారి కొంత మొత్తాన్ని రిడీమ్ చేసుకుంటారు. కాబట్టి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూలధన లాభాలపై పన్ను మీరు 10 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 10.3 శాతం, 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 20.6 శాతం చొప్పున చెల్లించాల్సి వస్తుంది. అందుకని పన్నులను పరిగణనలోకి తీసుకుంటే, మీరు గ్రోత్ ఆప్షన్లోనే ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒక వేళ మీరు 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీకు 28.84 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే మూలధన లాభాల పన్ను 30.9 శాతంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకే రంగంపై దృష్టిసారించే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఫార్మా, లేదా ఎఫ్ఎంసీజీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలిస్తున్నాను. ఎస్బీఐ ఫార్మా, ఐసీఐసీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్లను షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు? మీ అభిప్రాయం ఏమిటి? - నర్మద, వరంగల్ రంగాల వారీ ఫండ్స్ వివిధ మార్కెట్ పరిస్థితుల్లో వివిధ రకాలైన పనితీరును కనబరుస్తాయి. సంబంధిత రంగంపై అవగాహన అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రంగాల వారీ( సెక్టోరియల్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఫార్మా కేటగిరీ ఫండ్ 24 శాతం చొప్పున, ఎఫ్ఎంసీజీ కేటగిరీ ఫండ్ 9 శాతం చొప్పున రాబడులనిచ్చాయి. మూడు నుంచి ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎస్బీఐ ఫార్మా ఫండ్ అత్యధిక రాబడులనిచ్చింది. ఇదే కాలానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఫ్ఎంసీజీ ఫండ్ ఎస్బీఐ ఫార్మా ఫండ్ కంటే తక్కువ రాబడులనే ఇచ్చింది. నా వయస్సు 34 సంవత్సరాలు. సింగిల్ పర్సన్‌ను. ఇప్పటికే రెండు టర్మ్ ప్లాన్లు తీసుకున్నాను. 2007లో తీసుకున్న టర్మ్ ప్లాన్ 52 ఏళ్లవరకూ, 2011లో తీసుకున్న మరొక టర్మ్ ప్లాన్ 70 ఏళ్ల వరకూ కవర్ చేస్తాయి. మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటున్నాను. మూడు టర్మ్ ప్లాన్లు తీసుకోవడం సరైనదేనా? 2007లో తీసుకున్న టర్మ్ ప్లాన్‌కు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. దీని బీమా కవరేజ్ కూడా తక్కువగా ఉంది. అదీ 52 సంవత్సరాల వరకే, అందుకే దీనిని సరెండర్ చేసి, పెద్ద మొత్తానికి మరో టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది మంచి నిర్ణయమేనా? - హరిరాజ్, హైదరాబాద్ డైవర్సిఫికేషన్ ఉద్దేశం ప్రకారమైతే రెండు టర్మ్ ప్లాన్లు సరిపోతాయి. మూడో టర్మ్ ప్లాన్ అవసరం లేదు. ఎక్కువ ప్రీమియం చెల్లిస్తున్న 2007 నాటి టర్మ్ ప్లాన్‌ను సరెండర్ చేసి, అధిక కవరేజ్ ఉండే మరో టర్మ్ ప్లాన్ తీసుకోవడం సరైన నిర్ణయమే. తక్కువ ప్రీమియానికే ఎక్కువ బీమా ఇచ్చే సంస్థల టర్మ్ ప్లాన్లు తీసుకోండి. ఇలా తీసుకునేటప్పుడు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉన్న సంస్థ టర్మ్ ప్లాన్లనే ఎంచుకోండి. మీ జీవిత బీమా పాలసీ మీరు రిటైరయ్యేంత వరకూ లేదా మీ ఆర్థిక బాధ్యతలు మరొకరు చేపట్టేంత వరకూ ఉండాలి. మీపై ఆధారపడిన వాళ్ల ఆర్థిక అవసరాలను తీర్చేలా మీ బీమా కవర్ ఉండాలి. ఇన్‌క్రీజింగ్ టర్మ్ కవర్ సదుపాయం ఉన్న టర్మ్ ప్లాన్లను కూడా పరిశీలించవచ్చు. ఈ తరహా ప్లానుల్లో నిర్దేశిత కాలాల్లో బీమా కవర్ కొంత శాతం చొప్పున పెరిగే సౌలభ్యం ఉంటుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్ ఎంచుకునే పద్ధతి ఏమిటి?
మంచి ఫండ్‌ను ఎంచుకోవడానికి సరైన పద్ధతి ఏమిటి? ఈక్విటీ డైవర్సీఫైడ్ ఫండ్కంటే బ్యాలెన్స్డ్ ఫండ్ మెరుగైనదా? - విశాల్, వైజాగ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపికచేసుకునేటపుడు ఆయా ఫండ్స్‌కు వున్న రేటింగ్స్ చూడటం ఉపయోగపడుతుంది. టాప్ రేటింగ్స్ వుండే ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చినవాటిని...అవి గ్యారంటీ రాబడుల్ని ఆఫర్చేయకపోయినా మీరు విశ్వసించవచ్చు. మ్యూచువల్ ఫండ్ ధర, అవి ఆర్జించే రాబడులు రోజువారీగా మారిపోతుంటాయి. అయితే వాటికి (ఫండ్స్‌కు) వాల్యూ రీసెర్చ్ ఇచ్చే ఫండ్ రేటింగ్స్‌ను నెలకోసారి సవరించడం జరుగుతుంది. రేటింగ్ మార్పులు మరీ ఎక్కువగా లేకుండా మా రేటింగ్ పద్ధతిని రూపొందించాం. ఇక మీ రెండో ప్రశ్నకొస్తే...ఈక్విటీ ఫండ్స్‌కంటే రుణపత్రాల్లో పెట్టుబడి దృష్ట్యా బ్యాలెన్స్డ్ ఫండ్స్ మెరుగైన స్థిరత్వాన్ని ఇస్తాయి. మీరు భరించే రిస్క్నుబట్టి మీ ఎంపిక ఆధారపడివుంటుంది. ఒడుదుడుకుల్ని ఏమాత్రం భరించలేకపోతే ఎటువంటి మార్కెట్ ఆధారిత పెట్టుబడికైనా దూరంగా వుండండి. నా ఇద్దరు పిల్లలకోసం 10 సంవత్సరాలకుగాను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయదల్చాను. ఎక్కడ పెట్టుబడి చేయాలి? - శిరీష్, కరీంనగర్ మీ ఇద్దరు పిల్లల కోసం పెట్టుబడి చేసేటపుడు మీరు ఎటువంటి విభిన్న పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మంచి పనితీరు కనపర్చే ఓ రెండు ప్రధాన ఫండ్ స్కీములను ఎంచుకొని, వాటిలో సిప్ విధానంలో క్రమంగా పెట్టుబడి చేయండి. హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, యూటీఐ ఆపర్చూనిటీస్, బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ల నుంచి మల్టీ-క్యాప్ విభాగంలోని కొన్ని స్కీముల్ని ఎంచుకోవొచ్చు. మార్కెట్లు ఎలావున్నా వీటిలో పెట్టుబడి చేయవచ్చు. కానీ ఏడాదికోసారి ఈ పెట్టుబడుల్ని సమీక్షించుకోవాలి. నెలకు ఎన్‌పీఎస్‌లో నెలకు రూ. 500, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 16,000, ఈపీఎఫ్‌లో రూ. 8,000 చొప్పున పెట్టుబడి చేస్తున్నా. అయితే నాకు పీపీఎఫ్ అకౌంట్ లేదు. నా రిటైర్మెంట్ కోసం పీపీఎఫ్ ఖాతా కావాలనుకుంటున్నాను. 15 సంవత్సరాల్లో అది పరిపక్వం కావాలంటే నేను ఇప్పుడే ఆ ఖాతాను ప్రారంభించాల్సివుంటుందా? ప్రతీ నెలా నేను ఎంత పెట్టుబడి చేయాల్సివుంటుంది? - సురేష్. ఈ మెయిల్ పదవీ విరమణ తర్వాత స్థిరాదాయం, తక్షణాదాయ అవసరాల కోసం మీకు వివిధ మార్గాలు అవసరమవుతాయి. ఉదాహరణకు ఈపీఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ స్థిరాదాయం. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయం అలాంటిది కాదు. రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కోసం చూసేటపుడు ద్రవ్యోల్బణ ప్రభావం, మీకు ప్రతీ నెలా కచ్చితంగా కావాల్సిన మొత్తం వంటివి పరిగణనలోకి తీసుకోండి. ఉదాహరణకు ప్రస్తుతం మీరు ఏదైనా కొనడానికి రూ. 10 ఖర్చుచేస్తుంటే , ప్రతీ ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ప్రకారం అది పదేళ్ల తర్వాత రూ. 18 ధరకు పెరుగుతుంది. అందువల్ల మీ ప్రస్తుత పెట్టుబడి మీ రిటైర్మెంట్ అవసరాలకు తగినంతగా లేకపోతే ఇందుకోసం మీరు పొదుపును, పెట్టుబడుల్ని పెంచాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో మీరు పెట్టుబడిని 15 సంవత్సరాలు అట్టిపెట్టగలిగితే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) అనువైనది. మీ రిటైర్ అయ్యే సమయం తక్కువగావుంటే పదవీ విరమణ కోసం పెట్టుబడుల్ని పెంచుకోండి. నేను 10 శాతం టాక్స్ బ్రాకెట్లోకి వస్తాను. నేడు ఇండక్సేషన్ ప్రయోజనం కోసం ప్రయత్నించవచ్చా? - వినీల్, తిరుపతి మీకు వచ్చే ప్రయోజనం ఆధారంగానే మీరు వ్యవహరించాలి తప్ప, మీరు ఏ టాక్స్ బ్రాకెట్లో వున్నారన్నది ప్రధానం కాదు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లో చేస్తే, మీరు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌గా 10 శాతంగానీ, ఇండెక్సేషన్‌తో 20 శాతంగానీ చెల్లించవచ్చు. లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ అసెట్ అయినప్పటికీ, ఇండెక్సేషన్‌తో 20 శాతం చెల్లించినా, పన్ను తక్కువగానే వుంటుందిగనుక ఈ ఆప్షన్‌ను ఎంచుకోండి.