క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందా అంటే అది సౌతాఫ్రికానే (South Africa) అని చెప్పాలి. ఈ జట్టు పురుషుల, మహిళల విభాగాంలో సమానంగా దురదృష్టాన్ని షేర్ చేసుకుంటుంది. ఇటీవలికాలంలో ఏకంగా నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.
తొలుత మహిళల జట్టు 2023 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ మరుసటి ఏడాదే (2024) మహిళల జట్టు మరోసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో (న్యూజిలాండ్) చిత్తైంది. అదే ఏడాది (2024) పురుషుల జట్టుకు కూడా ఫైనల్లో (భారత్ చేతిలో) చుక్కెదురైంది. తాజాగా మహిళల జట్టు మరోసారి ఫైనల్లో ఓటమిపాలై, దురదృష్ట పరంపరను కొనసాగించింది.

2025 వన్డే ప్రపంచకప్‌లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ ప్రయాణంలో సౌతాఫ్రికా జట్టు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
ప్రపంచ కప్ టోర్నీల్లో సౌతాఫ్రికా జర్నీ క్రికెట్ అభిమానులను ఒకింత బాధకు గురి చేస్తుంది. పాపం సౌతాఫ్రికా.. అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. తాజా ప్రయత్నంలో సౌతాఫ్రికా వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ సమరంలో అద్భుతమైన క్రికెట్ ఆడిన భారత్ చేతిలో ఓడింది.
ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా సైతం అది నుంచి అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో భారత్ సహా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించిన ఈ జట్టు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో మాత్రమే ఓడింది).. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

ఫైనల్లోనూ సౌతాఫ్రికా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. తొలుత బౌలింగ్ చేసి భారీ స్కోర్ (298) ఇచ్చినప్పటికీ.. దాన్ని ఛేదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న వారి కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) మరోసారి శతకంతో విజృంభించింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు.
భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (9.3-0-39-5), షఫాలీ వర్మ (7-0-36-2), శ్రీచరణి (9-0-48-1) మ్యాజిక్ చేసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడినా హుందాగా ప్రవర్తించి అందరి మన్ననలు అందుకుంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టు చేతిలో ఓడామని సర్ది చెప్పుకుంది.
చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా


