breaking news
Laura Wolvaardt
-
ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును దక్కించుకుంది. 2025, అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును (ICC Player of the Month) కైవసం చేసుకుంది.అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీ (169) చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ నెలలో భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. లారా సెంచరీతో మెరిసినా సౌతాఫ్రికా ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచకప్ టైటిల్ గెలవలేకపోయినా, మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అంది. ఈ అవార్డు కోసం భారత స్టార్ బ్యాటర్, ప్రపంచకప్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ పోటీపడినప్పటికీ.. లారానే అదృష్టం వరించింది.పురుషుల విభాగంలో ముత్తుసామిఅక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికన్నే వరించింది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో అతను విశేషంగా రాణించాడు. తొలి టెస్ట్‌లో 11 వికెట్లు, రెండో టెస్ట్‌లో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ అవార్డు కోసం ముత్తసామితో పాటు పాకిస్తాన్ స్పిన్నర్ నౌమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పోటీపడ్డారు.ఐసీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన అభిమానులు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధుల ఓట్ల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించబడతాయి.చదవండి: ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు మొండిచెయ్యి..!
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నీని (Women's Cricket World Cup Team of the Tournament) ఐసీసీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు భారత్ నుంచి ముగ్గురు, రన్నరప్ జట్టు సౌతాఫ్రికా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. అలాగే ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియా నుంచి కూడా ముగ్గురికి చోటు లభించింది. ఈ ఎడిషన్ మరో సెమీ ఫైనలిస్ట్ అయిన ఇంగ్లండ్ నుంచి ఒకరు, లీగ్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన మరో ప్లేయర్‌కు 12వ సభ్యురాలిగా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు (Harmanpreet Kaur) చోటు దక్కలేదు.బెర్త్‌లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు చోటు కల్పించలేకపోయామని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రన్నరప్ టీమ్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్, ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు.లారా సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలు సహా టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలువగా.. కాప్ 2 అర్ద సెంచరీలు సహా 208 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. డి క్లెర్క్ 52 సగటున, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 208 పరుగులు చేసి, 26.11 సగటున 9 వికెట్లు తీసింది.భారత్ నుంచి టోర్నీ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన దీప్తి శర్మకు చోటు దక్కింది.మంధన సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేయగా.. జెమీ సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేసింది. దీప్తి సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సహా 22 వికెట్లు తీసి, టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శనలకు గానూ దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో చోటు దక్కించుకున్నారు. గార్డ్నర్ రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో పాటు 7 వికెట్లు తీయగా.. సదర్‌ల్యాండ్ ఓ హాఫ్ సెంచరీ చేసి, 17 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ 17.38 సగటున 13 వికెట్లు తీసింది.పాకిస్తాన్ నుంచి వికెట్‌కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్రా ఈ ప్రపంచకప్‌లో 8 డిస్మిసల్స్లో భాగంగా కావడంతో పాటు 62 పరుగులు చేయగా.. ఎక్లెస్టోన్ 14.25 సగటున 16 వికెట్లు తీసింది. 12వ ప్లేయర్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. బ్రంట్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 262 పరుగులు చేసి, 9 వికెట్లు తీసింది.చదవండి: స్మృతి మంధనకు భారీ షాక్ -
స్మృతి మంధనకు భారీ షాక్
విశ్వవిజేత భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలైన స్మృతి మంధనకు (Smriti Mandhana) భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో విశేషంగా రాణించినా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది.ఇదే ప్రపంచకప్‌లో మంధన కంటే మెరుగ్గా రాణించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్స్‌లో సెంచరీలతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన లారా కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (814) సాధించి, అగ్రపీఠాన్ని అధిరోహించింది.గత వారం రెండో స్థానంలో ఉండిన ఆసీస్ స్టార్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ ఓ స్థానం కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్‌లో టాప్-3 రన్ స్కోరర్లుగా నిలిచిన లారా, మంధన, గార్డ్నర్ ఐసీసీ తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ అదే స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రపంచకప్‌లో లారా 9 మ్యాచ్‌ల్లో 571 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మంధన 9 మ్యాచ్‌ల్లో 434 పరుగులు, గార్డ్నర్ 7 మ్యాచ్‌ల్లో 328 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో వీరోచిత శతకం సాధించిన టీమిండియా నంబర్-3 బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందింది. జెమీమా ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ 3 స్థానాలు మెరుగుపర్చుకొని సోఫీ డివైన్‌తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని షేర్ చేసుకుంది.మిగతా భారత ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ 4, దీప్తి శర్మ 3, రిచా ఘోష్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 14, 21, 30 స్థానాలకు ఎగబాకారు. భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఆసీస్ ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరింది.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా పేసర్ మారిజాన్ కాప్ 2 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్, ఆష్లే గార్డ్నర్ తలో స్థానం కోల్పోయి 3, స్థానాలకు పడిపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆష్లే గార్డ్నర్తో పాటు నాలుగో స్థానాన్ని పంచుకుంది. రేణుకా సింగ్ 19వ స్థానంలో కొనసాగుతుండగా.. శ్రీ చరణి 7 స్థానాలు మెరుగుపర్చుకొని 23వ స్థానానికి చేరింది.చదవండి: బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. వరల్డ్ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ (women's CWC) ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన లారా.. 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది. తద్వారా ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్‌లో 509 పరుగులు చేసింది.ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..లారా వోల్వార్డ్ట్- 570 (2025)అలైస్సా హీలీ- 509 (2022)రేచల్ హేన్స్- 497 (2022)డెబ్బీ హాక్లీ- 456 (1997)లిండ్సే రీలర్- 448 (1989)సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలుతాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో లారా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలు చేసింది. నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.మూడో ప్రయత్నంలోనూ..గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధాఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా -
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందా అంటే అది సౌతాఫ్రికానే (South Africa) అని చెప్పాలి. ఈ జట్టు పురుషుల, మహిళల విభాగాంలో సమానంగా దురదృష్టాన్ని షేర్ చేసుకుంటుంది. ఇటీవలికాలంలో ఏకంగా నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తొలుత మహిళల జట్టు 2023 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ మరుసటి ఏడాదే (2024) మహిళల జట్టు మరోసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో (న్యూజిలాండ్) చిత్తైంది. అదే ఏడాది (2024) పురుషుల జట్టుకు కూడా ఫైనల్లో (భారత్ చేతిలో) చుక్కెదురైంది. తాజాగా మహిళల జట్టు మరోసారి ఫైనల్లో ఓటమిపాలై, దురదృష్ట పరంపరను కొనసాగించింది.2025 వన్డే ప్రపంచకప్‌లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ ప్రయాణంలో సౌతాఫ్రికా జట్టు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.ప్రపంచ కప్ టోర్నీల్లో సౌతాఫ్రికా జర్నీ క్రికెట్ అభిమానులను ఒకింత బాధకు గురి చేస్తుంది. పాపం సౌతాఫ్రికా.. అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. తాజా ప్రయత్నంలో సౌతాఫ్రికా వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ సమరంలో అద్భుతమైన క్రికెట్ ఆడిన భారత్ చేతిలో ఓడింది.ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా సైతం అది నుంచి అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో భారత్ సహా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించిన ఈ జట్టు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో మాత్రమే ఓడింది).. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లోనూ సౌతాఫ్రికా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. తొలుత బౌలింగ్ చేసి భారీ స్కోర్ (298) ఇచ్చినప్పటికీ.. దాన్ని ఛేదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న వారి కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) మరోసారి శతకంతో విజృంభించింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు.భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (9.3-0-39-5), షఫాలీ వర్మ (7-0-36-2), శ్రీచరణి (9-0-48-1) మ్యాజిక్ చేసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడినా హుందాగా ప్రవర్తించి అందరి మన్ననలు అందుకుంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టు చేతిలో ఓడామని సర్ది చెప్పుకుంది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్‌కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్లను నిలువరించగలిగితే భారత్‌కు తిరుగు ఉండదు.ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసుఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.అన్నింటికంటే అదే ముఖ్యంటైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ..గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్‌గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్‌రూమ్‌లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా. ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.చదవండి: WC 2025 Final IND vs SA: ఇరుజట్ల బలాలు ఇవే -
IND vs SA: ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే
మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్ సందర్భంగా కొత్త చాంపియన్ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్ ఫైనల్‌కు చేరాయి.ఎవరు గెలిచినా చరిత్రేనవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్ పోరులో భారత్- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది.ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరేఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా.. సూ రెడ్‌ఫెర్న్ థర్డ్ అంపైర్‌గా.. నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్‌గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.వర్షం పడే అవకాశంకాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్టు తెలిపింది.ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్ డేన మ్యాచ్ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్: భారత్- సౌతాఫ్రికా జట్లుభారత్హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.సౌతాఫ్రికాలారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్, నదినె డి క్లెర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో మలాబా, అనెరి డెర్క్సెన్, అనెకె బాష్, మసబట క్లాస్, సునే లూస్, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్. చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్
మహిళల ప్రపంచకప్-2025 తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లారా భారీ సెంచరీతో చెలరేగింది. 26 ఏళ్ల వోల్వార్డ్ కేవలం 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169 పరుగులు చేసింది. ఆమె విధ్వసంకర బ్యాటింగ్ ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల మేరకు భారీ స్కోర్ సాధించింది. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో వోల్వార్ట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.లారా సాధించిన రికార్డులు ఇవే..👉ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఆమె నిలిచింది.👉మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రికార్డును లారా సమం చేసింది. మిథాలీ అత్యధికంగా 13 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించగా.. లారా కూడా సరిగ్గా 13 సార్లు ఏభైకి పైగా పరుగులు చేసింది. అయితే వోల్వార్డ్ కేవలం 23 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.👉మహిళల వన్డే క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచింది.👉ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్‌గా లారా రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(171), ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ(170) తొలి రెండు స్దానాల్లో ఉన్నారు. -
భారీ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.ఓపెనర్‌గా బరిలోకి దిగిన వోల్వార్డ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసింది. ఆమె కేవలం 115 బంతుల్లోనే తన పదివ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది. సెంచరీ పూర్తియ్యాక లారా మరింత చెలరేగిపోయింది. 47వ ఓవర్ వేసిన స్మిత్ బౌలింగ్‌లో వోల్వార్డ్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది. మొత్తంగా 143 బంతులు ఎదుర్కొన్న లారా వోల్వార్డ్.. 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169 పరుగులు చేసింది. ఆమెతో పాటు టాజ్మిన్ బ్రిట్స్(45), కాప్(42), ట్రయాన్(33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సోఫీ ఎక్లెస్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ రెండు, నాట్ స్కీవర్ ఒక్క వికెట్ సాధించారు. రెండో జట్టుగా రికార్డు..కాగా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనే పాకిస్తాన్‌పై 312 పరుగులు ప్రోటీస్ సాధించింది.అదేవిధంగా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో రెండో అత్యధిక టోటల్ నెలకొల్పిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో ఆసీస్ అగ్రస్ధానంలో ఉంది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఏకంగా 356 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు అతి భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90), సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.ఆఖర్లో నదినే డి క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 38వ ఓవర్లో 2 సిక్సర్లు, 39వ ఓవర్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదింది. 40వ ఓవర్లో బౌండరీ కొట్టిన అనంతరం ఔటైంది. ఆ ఓవర్లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. అయినా అంతిమంగా భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ముగ్గురు (తజ్మిన్ బ్రిట్జ్, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్ రావడం విశేషం. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీయగా.. కెప్టెన్ ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ డబుల్ సెంచరీ
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో వోల్వార్డ్ 200 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకుంది. మహిళల ప్రపంచకప్-2025లో వైజాగ్ వేదికగా భారత్‌తో మ్యాచ్ సందర్భంగా వోల్వార్డ్ ఈ ఫీట్ సాధించింది.2016లో సౌతాఫ్రికా తరపున ఇంటర్ననేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టిన లారా.. ఇప్పటివరకు 4 టెస్టులు, 112 వన్డేలు, 83 టీ20లు ఆడింది. 26 ఏళ్ల లారా గతేడాది సౌతాఫ్రికా ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైంది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు వోల్వార్డ్ చేర్చింది.అంతర్జాతీయ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడవ మహిళా క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. ఆమె కెరీర్లో ఇప్పటివరకు 9 వన్డే సెంచరీలు, టీ20, టెస్టుల్లో ఒక్కో శతకం సాధించింది. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 7013 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ అద్బుతమైన పోరాటం కనబరిచింది. కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్రతికా రావల్(37), స్నేహ్ రాణా(33) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, మల్బా, నాడిన్ డి క్లెర్క్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.చదవండి: డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! నిబంధనలు ఇవే? -
సౌతాఫ్రికా ఓపెనర్ల సరికొత్త చరిత్ర.. పాక్ గడ్డపై రికార్డుల మోత
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్, తంజిమ్ బ్రిట్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డుల్లోకెక్కారు. అలాగే పాకిస్తాన్ గడ్డపై వన్డే క్రికెట్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా చరిత్రకెక్కారు.లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 19) పాకిస్తాన్, సౌతాఫ్రికా మహిళా జట్లు వన్డే మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఆ జట్టు ఓపెనర్లు తంజిమ్, లారా తొలి వికెట్‌కు 260 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఏ వికెట్‌కైనా ఆరో అత్యధిక భాగస్వామ్యం.మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు భారత జోడీ పేరిట ఉంది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాలు (టాప్-6)దీప్తి శర్మ-పూనమ్ రౌత్ (భారత్, 320, తొలి వికెట్‌కు)కెర్-క్యాస్పరెక్ (న్యూజిలాండ్, 295, రెండో వికెట్‌కు)టేలర్-బేమౌంట్ (ఇంగ్లండ్, 275, రెండో వికెట్‌కు)టేలర్-అట్కిన్స్ (ఇంగ్లండ్, 268, తొలి వికెట్‌కు)టిఫెన్-బేట్స్ (న్యూజిలాండ్, 262, రెండో వికెట్‌కు)వోల్వార్డ్ట్-బ్రిట్స్ (సౌతాఫ్రికా, 260, రెండో వికెట్‌కు)మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. తంజిమ్ బ్రిట్స్ 171 పరుగులతో (141 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా ఉండగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 100 పరుగులు (129 బంతుల్లో 10 ఫోర్లు) చేసి ఔటైంది. పాక్ బౌలర్లలో డయానా బేగ్‌కు 2 వికెట్లు దక్కాయి.కాగా, సౌతాఫ్రికా మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చితు చేసింది. మూడో వన్డే లాహోర్‌లోనే సెప్టెంబర్ 22న జరుగనుంది. -
వరల్డ్‌కప్ టోర్నీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. 17 ఏళ్ల బ్యాటర్‌కు చోటు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup 2025) టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. స్టైలిష్ ఓపెనర్ లారా వొల్వర్ట్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ జట్టులో పదిహేడేళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మెసో (Karabo Meso)కు కూడా చోటు దక్కడం విశేషం.ఆమెకు ఇదే తొలిసారిఅండర్-19 వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన మెసో.. సీనియర్ జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్ స్పెషలిస్టు నొన్‌కులులెకో ఎమ్లాబాతో పాటు సీమర్లు మసబట క్లాస్, తుమి సెఖుఖునె కూడా స్థానం సంపాదించారు. మాజీ కెప్టెన్‌కు మొండిచేయిమరోవైపు.. ఆల్‌రౌండర్ల కోటాలో నదినె డి క్లెర్క్, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, నొండుమిసో షంగేజ్ వరల్డ్‌కప్ ఆడనున్నారు. అయితే, ఇటీవలే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ పేరును మాత్రం సౌతాఫ్రికా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. భారత్- శ్రీలంక వేదికగాఇక సీనియర్లు కొంతమంది మిస్సయినా.. హెడ్‌కోచ్ మండ్లా మషిమ్బీ మార్గదర్శనంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో వరల్డ్‌కప్ బరిలో దిగనుంది.కాగా సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు భారత్- శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టుతో పాటు సౌతాఫ్రికా వుమెన్ టీమ్ కూడా ఇంత వరకు ఒక్కసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవలేదు.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా జట్టులారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాక, క్లో ట్రియాన్, నదినె డి క్లర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో ఎమ్‌లాబా, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, మసబట క్లాస్, సునె లూస్, కరాబో మెసో, తుమి సుఖుఖునె, నొండుమిసో షంగేజ్.ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్‌బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్‌ను ఆడించండి.. అతడే అందుకు అర్హుడు’


