ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.
నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్‌కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్‌లను నిలువరించగలిగితే భారత్‌కు తిరుగు ఉండదు.
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు
ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.
అన్నింటికంటే అదే ముఖ్యం
టైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.
ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ..
గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా
‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్‌గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.
టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్‌రూమ్‌లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా.
ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.


