నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య తుది పోరు
జోరు మీదున్న టీమిండియా
మ.గం.3:00 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ప్రపంచ కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కు అర్హత సాధించినా నిరాశతో వెనుదిరిగిన జట్టు ఒక వైపు... సమష్టితత్వంలో మొదటి సారి తుది పోరుకు చేరిన టీమ్ ఒక వైపు... సొంతగడ్డపై పెద్ద ఎత్తున అభిమానుల ఆకాంక్షలు, మైదానంలో అండతో ఒక జట్టు కప్‌పై ఆశలు పెట్టుకోగా, తమ బలాన్నే నమ్ముకొని ప్రత్యర్థికి సవాల్ విసురుతున్న టీమ్ మరో వైపు... 12వ మహిళల వన్డే వరల్డ్ కప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది.
అన్ని అడ్డంకులను దాటి అగ్రగామిగా నిలిచిన రెండు టీమ్‌లు భారత్, దక్షిణాఫ్రికా పైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే టోర్నీని సాధించిన మూడు జట్లు ముందే నిష్క్రమించడంతో వరల్డ్ కప్‌లో కొత్త విజేత రావడం ఖాయమైంది. 2017 టోర్నీ ఫైనల్లో ఓడిన జట్టులో సభ్యులైన హర్మన్, స్మృతి, దీప్తి మాత్రమే ఈ సారి వరల్డ్ కప్ బరిలో నిలిచారు.
ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ పలు ఆసక్తికర సమరాల తర్వాత తుది ఘట్టానికి చేరింది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇరు జట్ల లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చేందుకు హర్మన్ బృందం సిద్ధమైంది. సెమీస్‌లో రెండు జట్లూ అద్భుత విజయాలతో తుది పోరుకు అర్హత సాధించాయి.
ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ అతి చేరువగా వచ్చిన ఈ అవకాశాన్ని వృథా చేసుకోరాదని పట్టుదలగా ఉండగా, బలబలాల పరంగా దక్షిణాఫ్రికా కూడా ఏమాత్రం తక్కువగా లేదు. ఈ మైదానంలో మన జట్టుకు బాగా అనుకూలమైంది కాగా...దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో తొలిసారి ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం ఖాయం.
మార్పుల్లేకుండా...
సెమీఫైనల్లో ఆ్రస్టేలియాపై సంచలన విజయం సాధించిన జట్టునే సహజంగా భారత్ కొనసాగించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన షఫాలీ దూకుడుగా ఆడి మెరుపు ఆరంభం ఇవ్వడంలో సమర్థురాలు. సెమీస్‌లో అనూహ్య రీతిలో వెనుదిరిగిన స్మృతి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే మన జట్టు ఓపెనింగ్‌తో మంచి పునాది ఖాయం. జెమీమా, హర్మన్ బ్యాటింగ్ సామర్థ్యం ఏమిటో సెమీస్‌లో కనిపించింది. వీరిద్దరు దానిని కొనసాగిస్తే తిరుగుండదు.
భారీ షాట్లకు పెట్టింది పేరైన రిచా ఘోష్‌తో పాటు మిడిల్ ఓవర్లలో సమర్థంగా ఆడే దీప్తి కూడా రాణిస్తే మన బ్యాటింగ్‌కు తిరుగుండదు. అదనపు బ్యాటింగ్ కోసం ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను తీసుకోవాలని భావిస్తున్నా... దక్షిణాఫ్రికా టీమ్‌లో అంతా కుడి చేతివాటం బ్యాటర్లే కావడంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రేణుక, క్రాంతి తమ పేస్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు.
అదనపు బ్యాటర్‌తో...
కెప్టెన్ లారా వోల్‌వార్ట్ అసాధారణ బ్యాటింగ్‌తో దూసుకుపోతుండటం దక్షిణాఫ్రికా ప్రధాన బలం. గత మ్యాచ్‌లో ఆమె మెరుపు సెంచరీతో చెలరేగింది. టోర్నీలో పెద్దగా ప్రభావం చూపకపోయినా మరో సీనియర్ ఓపెనర్ బ్రిట్స్ అసలు పోరులో సత్తా చాటాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. లూస్, మరిజాన్ కాప్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.
వైజాగ్ మ్యాచ్‌లో భారత్‌పై చెలరేగి ఒక్కసారి స్టార్‌గా మారిన డిక్లెర్క్ లాంటి బ్యాటర్ 9వ స్థానంలో ఆడే అవకాశం ఉండటం సఫారీ టీమ్‌కు మరో సానుకూలాంశం. ఆల్‌రౌండర్ క్లో ట్రయాన్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించగలదు. సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఒక బ్యాటర్‌ను తప్పించి బౌలర్ క్లాస్‌ను ఆడించింది. అయితే పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే క్లాస్ స్థానంలో అనరీ డెర్క్‌సన్ రావచ్చు.
20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 34 వన్డేలు జరగ్గా... భారత్ 20 గెలిచి 13 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వరల్డ్ కప్ మ్యాచ్‌లలో గత మూడు సార్లూ దక్షిణాఫ్రికానే నెగ్గింది.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. సెమీస్‌లాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండటంతో పాటు రాత్రి వేళ ఛేదన సులభం కాబట్టి టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సోమవారం రిజర్వ్ డే ఉంది. ఆట ఎక్కడ ఆగిపోతే అక్కడినుంచి మళ్లీ కొనసాగిస్తారు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, అమన్‌జోత్, రాధ, క్రాంతి, శ్రీచరణి, రేణుక.
దక్షిణాఫ్రికా: వోల్‌వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, అనెక్ బాష్, లూస్, కాప్, జాఫ్తా, డెర్క్‌సన్, ట్రయాన్, డిక్లెర్క్, ఖాకా, ఎంలాబా


