విహాన్ మల్హోత్రా- ఆరోన్ జార్జ్ (PC: ACC X)
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ ఖండాంతర టోర్నీలో ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు గ్రూప్-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్, మలేసియా జట్లను ఓడించి అజేయంగా సెమీస్‌కు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో శ్రీలంకతో తలపడింది.
దుబాయ్‌లో వాన పడిన కారణంగా టాస్ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించినా.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది.
లంక ఓపెనర్లు విరాన్ చముదిత (19), దుల్‌నిత్ సిగెరా (1) విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విమత్ దిన్సారా (32) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 42 పరుగులతో లంక తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్‌లో సెత్మిక సెనెవిరత్నె 30 పరుగులతో రాణించాడు. మిగిలిన వారిలో కవిజ గమాగే (2), కిత్మా వితనపతిరన (7), ఆధమ్ హిల్మీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.
భారత బౌలర్లలో హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్, ఖిలన్ పటేల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు.. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ శర్మ (7), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. రసిత్ నిమ్సారా వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు.
అయితే, వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాతో కలిసి ధనాధన్ దంచికొట్టాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. ఆరోన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 58 పరుగులతో.. విహాన్ 45 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆరోన్, విహాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పంచుకున్నారు.
అండర్-19 ఆసియా కప్-2025 సెమీ ఫైనల్-1 స్కోర్లు
👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్
👉వాన వల్ల ఆలస్యంగా పడిన టాస్.. వెట్‌ఫీల్డ్ కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్
👉శ్రీలంక స్కోరు: 138/8 (20)
👉భారత్: 139/2 (18)
👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్


