టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026కు ముందు శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా చరిత్ అసలంకను తప్పించింది. మాజీ సారథి దసున్ షనకకే మరోసారి టీ20 జట్టు పగ్గాలు అప్పగించింది.
అందుకే కెప్టెన్‌ని చేశాం
కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్ టోర్నీకి లంక క్రికెట్ బోర్డు శుక్రవారం తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఇందులో భాగంగా దసున్ షనకకు సారథిగా పెద్ద పీట వేయడంపై చీఫ్ సెలక్టర్‌గా తిరిగి వచ్చిన ప్రమోదయ విక్రమసింఘ స్పందించాడు.
‘‘షనక ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడు. నేను సెలక్టర్‌గా దిగిపోయేనాటికి షనకనే కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు చరిత్ మా దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఒకడిగా ఉన్నాడు. కెప్టెన్ అయిన తర్వాత చరిత్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.
సనత్ జయసూర్యతో చర్చించిన తర్వాతే
ఇటీవల అతడు బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నాం. హెడ్‌కోచ్ సనత్ జయసూర్యతో చర్చించిన తర్వాతే ఈ జట్టును ఎంపిక చేశాము. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు పెద్దగా మార్పులు చేయాలని మేము అనుకోలేదు’’ అని ప్రమోదయ విక్రసింఘ తెలిపాడు.
ఇక నిరోషన్ డిక్‌విల్లాను తిరిగి జట్టుకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. ‘‘ఓపెనర్‌గా.. రిజర్వు వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అతడు బహుముఖ పాత్రలు పోషించగలడు’’ అని విక్రమసింఘ తెలిపాడు. కాగా 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో చివరగా డిక్‌విల్లా లంక టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
తిరిగి సారథిగా..
కాగా 2021- 24 వరకు శ్రీలంక వన్డే, టీ20 జట్లకు దసున్ షనక సారథిగా ఉన్నాడు. అయితే, కెప్టెన్‌గా వరల్డ్‌కప్ టోర్నీలో విఫలం కావడంతో అతడిని తప్పించి.. అసలంకకు బాధ్యతలు ఇచ్చారు. అయితే, అసలంక సారథ్యంలో ముఖ్యంగా టీ20లలో శ్రీలంక చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఆసియా టీ20 కప్-2025లోనూ తేలిపోయింది. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో అనుభవానికి పెద్ద పీట వేస్తూ.. సెలక్షన్ కమిటీ దసున్ షనకపైనే మరోసారి నమ్మకం ఉంచింది. కాగా గత ఆసియా కప్ (టీ20) టోర్నీలో లంకను అతడు చాంపియన్‌గా నిలిపాడు. కాగా ఇటీవల పాకిస్తాన్ పర్యటన సందర్భంగా అసలంక భద్రతా కారణాలు చూపి మధ్యలోనే తప్పుకొన్నాడు. ఈ క్రమంలో షనక తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శ్రీలంక ప్రకటించిన ప్రాథమిక జట్టు
దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, కామిల్ మిశారా, కుశాల్ పెరీరా, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్‌విల్లా. జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్మనాయకే, సహాన్ అరాచిగే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మిలన్ రత్ననాయకే, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదూషాన్, మతీశ పతిరణ, దిల్షాన్ మధుషాంక, మహీశ్ తీక్షణ, దుషాన్ హేమంత, విజయకాంత్ వియస్కాంత్, త్రవీణ్ మాథ్యూ.
చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!


