ఆర్సీబీకి ఆడనున్న వెంకటేశ్ అయ్యర్‌తో పాటిదార్ (PC: RCB X)
వెంకటేశ్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్‌లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్‌క్లాస్ క్రికెట్‌లో 20, లిస్ట్-ఎ క్రికెట్‌లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్‌లు ఆడాడు.
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.
రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతం
అయితే, తాజా ఎడిషన్‌లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్‌గా నియమించింది.
పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్
అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్‌కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్‌గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు.
ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్‌తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టు
వెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్‌నెస్ ఆధారంగా).
చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'


