ఢిల్లీ క్యాపిటల్స్ (ఫైల్ ఫొటో PC: BCCI)
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.
రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో
అబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు
ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.
వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.
ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.
వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధర
ఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్‌గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)
వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.
చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!


