టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్ ఇయర్‌లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.
కాగా ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ తరఫున అదరగొట్టిన అభిషేక్ శర్మ 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 304 పరుగులు సాధించాడు.
ఇక టీమిండియా తరఫున ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్‌లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
2016లో విరాట్ కోహ్లి ఐపీఎల్, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.
కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్ నాలుగో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు.


