breaking news
Marizanne Kapp
-
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్‌కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్లను నిలువరించగలిగితే భారత్‌కు తిరుగు ఉండదు.ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసుఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.అన్నింటికంటే అదే ముఖ్యంటైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ..గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్‌గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్‌రూమ్‌లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా. ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.చదవండి: WC 2025 Final IND vs SA: ఇరుజట్ల బలాలు ఇవే -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజేన్ కాప్ (Marizanne Kapp) చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) రికార్డును బద్దలు కొట్టింది. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 29) తొలి సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లోనూ (42) రాణించిన కాప్.. బౌలింగ్‌లో చెలరేగిపోయింది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్లు తీసి, ప్రత్యర్ది పతనాన్ని శాశించింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మారిజేన్ కాప్-44ఝులన్ గోస్వామి-43లిన్ ఫుల్స్టన్-39మెగాన్ షట్-39క్యారోల్ హాడ్జస్-37మ్యాచ్ విషయానికొస్తే.. గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఇవాళ (అక్టోబర్ 30) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. నవీ ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..! -
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు అతి భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90), సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.ఆఖర్లో నదినే డి క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 38వ ఓవర్లో 2 సిక్సర్లు, 39వ ఓవర్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదింది. 40వ ఓవర్లో బౌండరీ కొట్టిన అనంతరం ఔటైంది. ఆ ఓవర్లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. అయినా అంతిమంగా భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ముగ్గురు (తజ్మిన్ బ్రిట్జ్, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్ రావడం విశేషం. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీయగా.. కెప్టెన్ ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
వరల్డ్‌కప్ టోర్నీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. 17 ఏళ్ల బ్యాటర్‌కు చోటు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup 2025) టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. స్టైలిష్ ఓపెనర్ లారా వొల్వర్ట్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ జట్టులో పదిహేడేళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మెసో (Karabo Meso)కు కూడా చోటు దక్కడం విశేషం.ఆమెకు ఇదే తొలిసారిఅండర్-19 వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన మెసో.. సీనియర్ జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్ స్పెషలిస్టు నొన్‌కులులెకో ఎమ్లాబాతో పాటు సీమర్లు మసబట క్లాస్, తుమి సెఖుఖునె కూడా స్థానం సంపాదించారు. మాజీ కెప్టెన్‌కు మొండిచేయిమరోవైపు.. ఆల్‌రౌండర్ల కోటాలో నదినె డి క్లెర్క్, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, నొండుమిసో షంగేజ్ వరల్డ్‌కప్ ఆడనున్నారు. అయితే, ఇటీవలే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ పేరును మాత్రం సౌతాఫ్రికా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. భారత్- శ్రీలంక వేదికగాఇక సీనియర్లు కొంతమంది మిస్సయినా.. హెడ్‌కోచ్ మండ్లా మషిమ్బీ మార్గదర్శనంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో వరల్డ్‌కప్ బరిలో దిగనుంది.కాగా సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు భారత్- శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టుతో పాటు సౌతాఫ్రికా వుమెన్ టీమ్ కూడా ఇంత వరకు ఒక్కసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవలేదు.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా జట్టులారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాక, క్లో ట్రియాన్, నదినె డి క్లర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో ఎమ్‌లాబా, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, మసబట క్లాస్, సునె లూస్, కరాబో మెసో, తుమి సుఖుఖునె, నొండుమిసో షంగేజ్.ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్‌బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్‌ను ఆడించండి.. అతడే అందుకు అర్హుడు’


