మహిళల ఐపీఎల్ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ మారిజాన్ కాప్ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది.
కాప్‌తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్ (4-0-36-0), స్నేహ్ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్ వేసి 14 పరుగులు సమర్పించుకుంది.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో నాట్ సీవర్ బ్రంట్ (65 నాటౌట్) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
మిగతా ప్లేయర్లలో సంజీవన్ సజనా (9), హేలీ మాథ్యూస్ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్ కౌర్ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.
కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.


