
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup 2025) టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. స్టైలిష్ ఓపెనర్ లారా వొల్వర్ట్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ జట్టులో పదిహేడేళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మెసో (Karabo Meso)కు కూడా చోటు దక్కడం విశేషం.
ఆమెకు ఇదే తొలిసారి
అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన మెసో.. సీనియర్ జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్ స్పెషలిస్టు నొన్‌కులులెకో ఎమ్‌లాబాతో పాటు సీమర్లు మసబట క్లాస్, తుమి సెఖుఖునె కూడా స్థానం సంపాదించారు.
మాజీ కెప్టెన్‌కు మొండిచేయి
మరోవైపు.. ఆల్‌రౌండర్ల కోటాలో నదినె డి క్లెర్క్, అన్నెకె బాష్, అనెరి డెర్క్‌సెన్, నొండుమిసో షంగేజ్ వరల్డ్‌కప్ ఆడనున్నారు. అయితే, ఇటీవలే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ పేరును మాత్రం సౌతాఫ్రికా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
భారత్- శ్రీలంక వేదికగా
ఇక సీనియర్లు కొంతమంది మిస్సయినా.. హెడ్‌కోచ్ మండ్లా మషిమ్‌బీ మార్గదర్శనంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో వరల్డ్‌కప్ బరిలో దిగనుంది.
కాగా సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు భారత్- శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టుతో పాటు సౌతాఫ్రికా వుమెన్ టీమ్ కూడా ఇంత వరకు ఒక్కసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవలేదు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా జట్టు
లారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాక, క్లో ట్రియాన్, నదినె డి క్లర్క్, మరిజానే కాప్, తజ్‌మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో ఎమ్‌లాబా, అన్నెకె బాష్, అనెరి డెర్క్‌సెన్, మసబట క్లాస్, సునె లూస్, కరాబో మెసో, తుమి సుఖుఖునె, నొండుమిసో షంగేజ్.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా.
స్టాండ్‌బై: సయాలీ సత్‌ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.
చదవండి: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్‌ను ఆడించండి.. అతడే అందుకు అర్హుడు’