
భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్య
టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson)కు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) మద్దతుగా నిలిచాడు. ఈ కేరళ బ్యాటర్‌ను టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో తప్పక ఆడించాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. అది జరగాలంటే.. ముందుగా ఆసియా కప్-2025 (Asia Cup) ఈవెంట్లో సంజూకు తుదిజట్టులో ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నాడు.
ఎనిమిది జట్లు
ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. యూఏఈ వేదికగా జరిగే ఈ ఖండాంతర టోర్నీలో.. భారత్, పాకిస్తాన్, యూఈఏ, ఒమన్.. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి.
వైస్ కెప్టెన్‌గా
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గత నెలలోనే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను వెల్లడించింది. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్.. వైస్ కెప్టెన్‌గా తిరిగి నియమితుడయ్యాడు.
ఓపెనర్‌గానూ ఫిక్స్
అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్‌గా రావడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రమంలో.. గిల్ గైర్హాజరీలో అభిషేక్‌కు జోడీగా ఉన్న సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటుపై సందేహాలు నెలకొన్నాయి. వికెట్ కీపర్‌గా వద్దామన్నా.. జితేశ్ శర్మ రూపంలో సంజూకు గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ సంజూను మూడో స్థానంలో ఆడించాలంటూ కొత్త వాదన తీసుకువచ్చాడు.
తిలక్ వద్దు.. సంజూను ఆడించండి
‘‘ఆసియా కప్ టోర్నీలో అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వస్తారు. అయితే, మూడో స్థానం కోసం తిలక్ వర్మ కంటే సంజూ బెటర్. తిలక్.. ఇంకా యువకుడే. అతడికి మున్ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ సంజూ శాంసన్ లాంటి సీనియర్, అనుభవశాలి అయిన బ్యాటర్ ఇప్పుడు జట్టుకు అవసరం.
ఇంకో ఆర్నెళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ ఆడబోతోంది. కాబట్టి సంజూకు వరుస అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. అందుకు అతడు అర్హుడు కూడా’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా సంజూ శాంసన్ ఇప్పటి వరకు కేవలం మూడు అంతర్జాతీయ టీ20లలో మాత్రమే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, పొట్టి ఫార్మాట్లో (వివిధ లీగ్‌లలో) వన్‌డౌన్‌లో వచ్చి భారీగా పరుగులు రాబట్టిన ఘనత సంజూకు ఉంది.
ఏకైక బ్యాటర్‌గా సంజూ చరిత్ర
ఇప్పటి వరకు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 291 ఇన్నింగ్స్‌లో 133 సార్లు మూడో స్థానంలో వచ్చి.. 4136 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 31 ఫిఫ్టీలు కూడా ఉండటం విశేషం. ఇక గతేడాది తిలక్ వర్మ, సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గొప్పగా రాణించారు. సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలతో ఇరగదీశారు.
ఈ క్రమంలో ఒకే ఏడాదిలో టీమిండియా తరఫున మూడు శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా సంజూ చరిత్ర సృష్టించగా.. తిలక్ వర్మ వరుసగా రెండు సెంచరీలు సాధించడం గమనార్హం.
చదవండి: ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు