
వెస్ట్ జోన్‌తో రేపటి నుంచి (సెప్టెంబర్ 4) ప్రారంభం కాబోయే దులీప్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు ముందు సెంట్రల్ జోన్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ డెంగ్యూ కారణంగా టోర్నీ నుంచి తప్పించబడ్డాడు.
జురెల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతూ కోలుకోలేకపోతున్నాడు. దీంతో సెలెక్టర్లే స్వయంగా రంగంలోని దిగి అతన్ని తప్పించారు. జురెల్‌కు ప్రత్యామ్నాయంగా విదర్భ రంజీ కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌ను ప్రకటించారు.
వాస్తవానికి ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జురెల్‌నే సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే నార్త్‌ఈస్ట్ జోన్‌తో మ్యాచ్ సమయానికి అతనికి జ్వరం ప్రారంభం కావడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు.
జురెల్ స్థానంలో రజత్ పాటిదార్ ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా జురెల్ టోర్నీ మొత్తం నుంచే వైదొలగడంతో పాటిదార్ సెంట్రల్ జోన్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
నార్త్‌ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తరఫున దనిశ్ మాలేవార్ (203 రిటైర్డ్ ఔట్), రజత్ పాటిదార్ (125), యశ్ రాథోడ్ (87 నాటౌట్), ఆర్యన్ జుయెల్ (60 రిటైర్డ్ హర్ట్) చెలరేగి ఆడారు.
జురెల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించిన అక్షయ్ వాద్కర్‌కు వాస్తవానికి సెంట్రల్ జోన్ తొలుత ప్రకటించిన జట్టుకే ఎంపిక చేయాల్సి ఉండింది. అయితే టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు అధికంగా అందుబాటులో ఉండటం చేత అప్పట్లో అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.
భీకర ఫామ్‌లో ఉండిన వాద్కర్‌ను పట్టించుకోకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చాలా మంది వాద్కర్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నించారు. వాద్కర్ తాజాగా ముగిసిన రంజీ ట్రోఫీలో విదర్భను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఆ సీజన్‌లో అతను 10 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 722 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపర్‌గానూ (24 డిస్మిసల్స్) సత్తా చాటాడు.
తప్పుకున్న కుల్దీప్
సెమీస్‌కు ముందు సెంట్రల్ జోన్‌కు మరో షాక్ కూడా తగిలింది. క్వార్టర్ ఫైనల్లో ఆడిన కుల్దీప్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన కారణంగా జట్టును నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో అప్పటికే స్టాండ్ ప్లేయర్‌గా జట్టులో ఉండిన ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.