సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్‌కు షాకులు తగిలాయి.
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్ చేసిన ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్.. మూడో ఓవర్ ఆరంభంలోనే రాహుల్‌ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‌చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు.
ఆచితూచి ఆడకపోతే..
ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.
అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్ గార్డెన్స్ పిచ్ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.
మరి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదన
భారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదన
భారత్ వర్సెస్ ఇంగ్లండ్- 2012లో ఇంగ్లండ్ 41 పరుగుల లక్ష్య ఛేదన
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదన
భారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1977లో ఇంగ్లండ్ 16 పరుగుల లక్ష్య ఛేదన.
చదవండి: సన్‌రైజర్స్ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?


