సన్‌రైజర్స్‌ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత? | SRH IPL 2026 Retentions: Retained And Released Players List Purse Remaining | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?

Nov 15 2025 9:29 PM | Updated on Nov 15 2025 9:33 PM

SRH IPL 2026 Retentions: Retained And Released Players List Purse Remaining

ఐపీఎల్‌-2026 వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ (Mohammed Shami)ని.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. తాజాగా వచ్చే సీజన్‌కు గానూ అట్టిపెట్టుకునే, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.

రాహుల్‌ చహర్‌, అభినవ్‌ మనోహర్‌, ఆడం జంపా (Adam Zampa), సిమర్‌జీత్‌ సింగ్‌ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్సును ఖాళీ చేసుకుంది. షమీని ట్రేడ్‌ చేయడం ద్వారా రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌతాఫ్రికా స్టార్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను సన్‌రైజర్స్‌ వేలంలోకి వదల్లేదు.

అతడు జట్టుతోనే.. 
కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ట్రవిస్‌ హెడ్‌ వంటి స్టార్‌ ప్లేయర్లతో పాటు.. క్లాసెన్‌ను అట్టిపెట్టుకుంది. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్‌లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజేయ శతకం (105) ఉండటం విశేషం.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ పద్నాలుగింట కనీసం ఆరైనా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్లలో క్లాసెన్‌ ముఖ్యుడు. అయితే, అతడి ప్రైజ్‌ ట్యాగ్‌ (రూ. 23 కోట్లు) కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా.. ఫ్రాంఛైజీ మాత్రం ఆ పని చేయలేదు.

పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు
రాబోయే సీజన్‌కు ముందు మొత్తానికి సన్‌రైజర్స్‌ ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండగా.. ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్‌ చేయడం ద్వారా సన్‌రైజర్స్‌ పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా పది స్లాట్లు ఖాళీ ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా
ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, అనికేత్‌ వర్మ, జీషన్‌ అన్సారీ, హర్ష్‌ దూబే, కమిందు మెండిస్‌, ఇషాన్‌ మలింగ, బ్రైడన్‌​ కార్స్‌.  

సన్‌రైజర్స్‌ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే
రాహుల్‌ చహర్‌ (రూ. 3.20 కోట్లు), అభినవ్‌ మనోహర్‌ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్‌జీత్‌ సింగ్‌ (రూ. 1.50 కోట్లు), వియాన్‌ ముల్దర్‌ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్‌ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్‌ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్‌).

చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌కు భారీ షాక్‌.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement