సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
టార్గెట్ 124
ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) మొదలైంది. తొలిరోజు పేసర్లు సత్తా చాటగా.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.
అనంతరం ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా.. 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను.. 153 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా.. భారత జట్టు లక్ష్యం 124 పరుగులుగా మారింది. దీంతో టార్గెట్ చిన్నదే కదా అని సంబరపడిన అభిమానులకు సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ ఆదిలోనే షాకులు ఇచ్చారు.
చెలరేగిన సఫారీ పేసర్
మొత్తంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో కైలీ వెరెన్నెకు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్.. ఈసారి ఆరు బంతులు ఎదుర్కొని యాన్సెన్ బౌలింగ్‌లో వెరెన్నెకు క్యాచ్ ఇవ్వడంతో నిష్క్రమించాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రాహుల్ అవుటయ్యాడు.
తొలి ఓవర్లో జైసూను.. మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్‌ను వెనక్కి పంపి యాన్సెన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో కేవలం ఒకే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే, వన్‌డౌన్‌లో వాషింగ్టన్ సుందర్ రాగా.. నాలుగో స్థానంలో మరో ప్రయోగానికి టీమిండియా తెరలేపింది.
జురెల్ ముందుగానే
కెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను టాప్‌కి ప్రమోట్ చేసింది. నిజానికి ఐదో నంబర్ బ్యాటర్ పంత్ బ్యాటింగ్‌కు వస్తాడనుకుంటే అనూహ్యంగా జురెల్ ముందుగా వచ్చాడు.
ఇక భోజన విరామ సమయానికి ఏడు ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి పది పరుగులే చేసింది. వాషీ 20 బంతుల్లో 5, జురెల్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో నిలిచారు.
టీమిండియా చెత్త రికార్డు
జైసూ, రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగోసారి అత్యల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది.
సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు సంయుక్తంగా సాధించిన అత్యల్ప స్కోర్లు
👉1964లో ఆస్ట్రేలియాతో చెన్నై మ్యాచ్‌లో- 0 (ఎంఎల్ జైసింహ 0, ఇంద్రజిత్‌సిన్హ్‌జీ 0)
👉1999లో న్యూజిలాండ్‌తో మొహాలీ మ్యాచ్‌లో- 0 (దేవాంగ్ గాంధీ 0, సదగోపన్ రమేశ్ 0)
👉2010లో న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ మ్యాచ్‌లో- 1 (గంభీర్ 0, సెహ్వాగ్ 1)
👉2025లో సౌతాఫ్రికాతో కోల్‌కతాలో మ్యాచ్‌లో- 1 (జైస్వాల్0, కేఎల్ రాహుల్ 1).
చదవండి: ఐసీయూలో శుబ్‌మన్ గిల్


