టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) గాయం తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు తొలి టెస్టులో మిగిలిన ఆటకు.. రెండో టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
బిజీబిజీ
కాగా టెస్టు, వన్డే సారథి గిల్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఆసియా టీ20 కప్ టోర్నీ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ (IND vs SA)లో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.
కోల్‌కతాలో సఫారీ జట్టుతో శుక్రవారం మొదలైన టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. అయితే, శనివారం నాటి ఆట సందర్భంగా కెప్టెన్ గిల్ మెడకు గాయమైంది. నాలుగో నంబర్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన గిల్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
నొప్పి ఎక్కువగా ఉండటంతో
ప్రొటిస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్‌కు మెడపట్టేసింది. వెంటనే ఫిజియో వచ్చి గిల్‌ను పరిశీలించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్‌ను డ్రెసింగ్‌రూమ్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా అతడిని కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఐసీయూలో చికిత్స
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. గిల్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. అయితే, ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే వైద్యుల సమక్షంలో ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ చేయిస్తున్నట్లు వెల్లడించాయి.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే
గిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటైందని.. క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం గిల్ వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని.. పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే అతడు మళ్లీ మైదానంలో దిగుతాడా? లేదా? అన్నది తేలుతుందని తెలిపాయి.
కాగా తొలి ఇన్నింగ్స్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత కూడా మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్‌గా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.
ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
బీసీసీఐ అప్‌డేట్
గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడని తెలిపింది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.


