ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.
ఏకంగా రూ. 18 కోట్లు
సంజూ కోసం సీఎస్‌కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్‌ను సీఎస్‌కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు సీఎస్‌కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్‌కే
ఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్‌కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్‌కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్‌నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.
వైస్ కెప్టెన్‌గా?
అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్‌గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్‌కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే.
కాబట్టి సంజూ సీఎస్‌కేలో ఓ సాధారణ క్రికెటర్‌గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్‌లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్‌గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.
కేవలం నాలుగే గెలిచి
కాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్‌లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్‌గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్‌లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.
అయితే, ఈసారి సీఎస్‌కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్‌కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)
రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.
చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు
మతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్‌కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).
చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే


