వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 31) ప్రకటించారు. ఈ జట్టును స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముందుండి నడిపించనున్నాడు. స్టార్ ఆటగాళ్లు గుల్బదిన్ నైబ్, నవీన్ ఉల్ హక్ రీఎంట్రీ ఇచ్చారు. 20 ఏళ్ల వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ ఇషాక్ కొత్తగా జట్టులోకి వచ్చాడు.
తాజాగా జింబాబ్వే సిరీస్‌లో ఆడిన షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, బషీర్ అహ్మద్, ఇజాజ్ అహ్మద్, అహ్మద్‌జాయ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. మొత్తంగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఛాంపియన్ జట్లకు సైతం వణుకు పుట్టిస్తుంది.
ఈ జట్టులో రషీద్ ఖాన్ సహా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. నూర్ అహ్మద్, సెదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఇబ్రహీం జద్రాన్ లాంటి ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు.
పైగా వీరికి భారత్, శ్రీలంకలో పరిస్థితులపై సరైన అవగాహన కూడా ఉంది. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టును చూసి భారత్ సహా మిగతా జట్లన్నీ అప్రమత్తం అవుతున్నాయి.
2026 టీ20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు..
రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దర్వీష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్
రిజర్వ్ ఆటగాళ్లు: అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.
ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-డిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న న్యూజిలాండ్‌తో చెన్నైలో ఆడనుంది.
ప్రపంచకప్‌కు ముందు (జనవరి 19 నుంచి) ఇదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.


