వరుస శతకాలతో దూసుకుపోతున్న పడిక్కల్‌, రుతురాజ్‌ | ruturaj, padikkal slams centuries against uttarakhand and puducherry | Sakshi
Sakshi News home page

వరుస శతకాలతో దూసుకుపోతున్న పడిక్కల్‌, రుతురాజ్‌

Dec 31 2025 2:48 PM | Updated on Dec 31 2025 3:19 PM

ruturaj, padikkal slams centuries against uttarakhand and puducherry

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా యువ బ్యాటర్, కర్ణాటక స్టార్‌ ప్లేయర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలతో శతక మోత మోగించాడు. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ​్‌లో 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసిన అతను.. జార్ఖండ్‌ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేరళపై (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకాలు బాదాడు

తాజా శతకంతో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో పడిక్కల్‌ శతకాల సంఖ్య 12కి చేరింది. పడిక్కల్‌ కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే 12 శతకాలు, 12 అర్ద శతకాలతో 80కిపైగా సగటుతో 2300 పైచిలుకు పరుగులు చేశాడు.

పుదుచ్చేరితో మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌, మయాంక్‌ సెంచరీలకు కరుణ్‌ నాయర్‌ (34 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ కూడా తోడైంది.

సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్‌
ఇవాళే (డిసెంబర్‌ 31) జరిగిన మరో మ్యాచ్‌లో మరో టీమిండియా యువ బ్యాటర్‌, మహారాష్ట్ర స్టార్‌ ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (113 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌ ఈ శతకం బాదాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (50-3) రుతురాజ్‌ బ్యాట్‌ నుంచి ఈ క్లాసిక్‌ సెంచరీ వచ్చింది. రుతురాజ్‌ శతకం కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర భారీ స్కోర్‌ (331-7) చేసింది.

ఈ సెంచరీతో రుతురాజ్‌ తన లిస్ట్‌-ఏ శతకాల సంఖ్యను 19కి పెంచుకున్నాడు. రుతురాజ్‌ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ ఏడాది రుతురాజ్‌ ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియా-ఏ, ఇండియా, తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీ.. ఇలా ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ సెంచరీలు చేసి, విరాట్‌ కోహ్లి తర్వాత టీమిండియా ఆశాకిరణంగా మారాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement