టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.
జైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్‌క్రిష్ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్‌తో కలిసి యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.
జైసూ జస్ట్ మిస్..
అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్ మిసాల్ (Darshan Misal) బౌలింగ్‌లో స్నేహల్ కౌతంకర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్ ఖాన్‌కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపాడు.
సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
తమ్ముడు ముషీర్ (60)తో కలిసి మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్ ఖాన్.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.
మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. 157 పరుగులు చేసి దర్శన్ మిసాల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్ తామోర్ హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.
ముంబై భారీ స్కోరు
ఇక సిద్దేశ్ లాడ్ 17, షామ్స్ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్ కొటియాన్ (12 బంతుల్లో 23), తుషార్ దేశ్‌పాండే (3 బంతుల్లో 7) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్ మిసాల్ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్, లలిత్ యాదవ్ చెరో రెండు, దీప్‌రాజ్ గవోంకర్ ఒక వికెట్ కూల్చారు.


