కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) విమర్శించాడు. సౌతాఫ్రికాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటిచ్చిన సెలక్టర్లు.. అర్హుడైన మరో ఆటగాడిని మాత్రం ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. టెస్టుల్లో ఆడుతున్నాడనే కారణంతో ధ్రువ్ జురెల్‌ను వన్డేలకు కూడా సెలక్ట్ చేయడం సరికాదని విమర్శించాడు.
కాగా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ.
ప్రస్తుతం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుండగా... ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.
వాళ్లు దూరం.. వీరికి విశ్రాంతి
ఈ నెల 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరుగుతాయి. సఫారీలతో తొలి టెస్టు సందర్భంగా గిల్ గాయపడగా... శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా అంతకుముందే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో గతంలో 12 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించిన రాహుల్‌కు మరోసారి అవకాశం దక్కింది.
సీనియర్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు.

సంజూకు దక్కని చోటు
అయితే, ఈ జట్టులో సంజూ శాంసన్ పేరు మాత్రం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరఫున వన్డే ఆడిన సంజూ.. సెంచరీ చేశాడు. అది కూడా సౌతాఫ్రికా గడ్డపై శతక్కొట్టాడు. కానీ ఆ తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కనే లేదు. తాజాగా స్వదేశంలో ప్రొటిస్ జట్టుతో సిరీస్‌లో ఆడిస్తారని భావించగా.. మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ సంజూకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఈ జట్టులో ఒక పేరు కచ్చితంగా ఉండాలని నేను కోరుకున్నాను. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. దాదాపు రెండేళ్ల క్రితం వన్డే ఆడిన అతడు శతకంతో చెలరేగాడు.
అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?
కానీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు సెలక్ట్ చేస్తారని భావించా. ఆడిన చివరి మ్యాచ్‌లో శతకం బాదిన ఆటగాడు జట్టులో చోటుకైనా అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాటర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపికయ్యారు. సీనియర్ అయిన సంజూను కాదని.. వన్డేలో టీమిండియాకు ఆడిన అనుభవం లేని జురెల్‌కు సెలక్టర్లు చోటు ఇవ్వడం గమనార్హం. కాగా జురెల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 457, 12 పరుగులు చేశాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్


