జట్టు కూర్పుపై స్పష్టత ఉంది
కివీస్ సిరీస్ పాఠాలు నేర్పింది
టీమిండియా అసిస్టెంట్ కోచ్ డస్కటే
కోల్‌కతా: ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురేల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతాడని భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటే వెల్లడించారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్‌ను ఆడిస్తామని ఆయన చెప్పారు. 24 ఏళ్ల వికెట్ కీపర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఏడు టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జరిగిన రెండు అనధికారిక టెస్టులు సహా గత ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో జురేల్ నాలుగు సెంచరీలు చేశాడు.
రెగ్యులర్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గైర్హాజరీలో జురేల్ ఇంగ్లడ్ పర్యటనలో నాలుగో టెస్టు ఆడాడు. అయితే ఇప్పుడు పంత్ పునరాగమనం చేయనుండటంతో జురేల్ స్థానంపై నెలకొన్న సందేహాల్ని సహాయ కోచ్ డక్కటే ఒక్క మాటతో నివృత్తి చేశాడు. ఫామ్‌లో ఉన్న జురేల్, రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ ఇద్దరిని తొలి టెస్టులో ఆడిస్తామని స్పష్టం చేశారు.
వ్యూహాలకు అనుగుణంగానే...
‘కాంబినేషన్‌పై పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఇద్దరు వికెట్ కీపర్లలో ఏ ఒక్కరిని పక్కనబెట్టే ఉద్దేశం జట్టు మేనేజ్‌మెంట్‌కు లేదు’ అని డస్కటే వెల్లడించారు. గత ఆరు నెలలుగా నిలకడైన ఫామ్‌ను కొనసాగిస్తున్న ధ్రువ్ జురేల్ ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో ఆడతాడని చెప్పారు.
నితీశ్‌ను పక్కనబెట్టడంపై స్పందిస్తూ... ‘అతను వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడాడు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగవుతూనే ఉన్నాడు. కాబట్టి అతని భవిష్యత్తుకు ఎలాంటి ముప్పులేదు. అయితే ప్రస్తుత జట్టు వ్యూహాలకు అనుగుణంగానే అతను తుది జట్టుకు దూరం కానున్నాడు.
బలమైన ప్రత్యర్థితో మ్యాచ్ గెలవాలంటే అందుబాటులో ఉన్న వనరుల్లో మరింత మెరుగైన బలగంతోనే బరిలోకి దిగుతాం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అంతేకానీ నితీశ్‌ను విస్మరించడం మాత్రం కాదు’ అని డస్కటే వివరించారు.
పరుగులు చేసే స్పిన్నర్లు
ఇక లోయర్ మిడిలార్డర్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల రూపంలో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా ఉందని అసిస్టెంట్ కోచ్ అన్నారు. వాళ్లు స్పిన్నర్లయి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్ అవసరాల్ని తీరుస్తారని, కాబట్టి వారిపుడు బ్యాటర్లుగా పరిగణించవచ్చని చెప్పారు. తద్వారా కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటాడనే విషయాన్ని డస్కటే చెప్పకనే చెప్పినట్లయ్యింది.
దీంతో ఇద్దరు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ దళాన్ని తొలి టెస్టులో దింపేందుకు భారత టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ముగ్గురు టాపార్డర్, ముగ్గురు మిడిలార్డర్ బ్యాటర్లతో స్పెషలిస్టు బ్యాటింగ్ విభాగానికి ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు జట్టును నడిపించనున్నారు.
కసరత్తు చేశాం...
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని డస్కటే పేర్కొన్నారు. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన కివీస్ 3–0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసింది. మన సిŠప్‌న్ పిచ్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు ఎజాజ్ పటేల్ (15 వికెట్లు), మిచెల్ సాన్‌ట్నర్ (13), ఫిలిప్స్ (8) పండగ చేసుకున్నారు.
ఈ ముగ్గురు కలిసి 36 వికెట్లు తీయడమే భారత్ కొంపముంచింది. దీనిపై అసిస్టెంట్ కోచ్ మాట్లాడుతూ ‘స్పిన్నేయడమే కాదు... ప్రత్యర్థి స్పిన్‌ను ఎదుర్కోవడంపై కూడా కసరత్తు చేశాం. ఎందుకంటే సఫారీ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లే అందుబాటులో ఉన్నరు. కాబట్టి కివీస్ నేర్పిన గత పాఠాల అనుభవంతో జట్టు సిద్ధమైంది’ అని అన్నారు.


