సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి సొంత దేశ క్రికెట్ బోర్డునే (Cricket South Africa) కోర్టుకు లాగాడు. న్యాయపోరాటంలో విజయం కూడా సాధించాడు. జోహన్నెస్‌బర్గ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్ తగిలినట్లైంది. కోర్టు తీర్పు మేరకు షంషికి భారీ ఊరట లభించింది.
అసలేం జరిగిందంటే..?
SA20 వేలంలో షంషిని ఎం కేప్‌టౌన్ ఫ్రాంఛైజీ 5 లక్షల ర్యాండ్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్‌కు షంషి నో చెప్పాడు. సమాంతరంగా ఇతర లీగ్‌లతో (ILT20, BBL) ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ లీగ్‌ల్లో ఆడేందుకు షంషికి సొంత దేశ క్రికెట్ బోర్డు (CSA) అనుమతి తప్పనిసరి. ఇక్కడే షంషికి, క్రికెట్ సౌతాఫ్రికాకు వివాదం మొదలైంది.
సొంత దేశ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలో జరిగే లీగ్‌ను కాదని, పరాయి దేశ లీగ్‌లు ఆడాలనుకున్న షంషికి CSA అనుమతి నిరాకరించింది. NOC ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో షంషి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు.
షంషి పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. షంషి విదేశీ లీగ్‌ల్లో పాల్గొంనేందుకు వీలుగా NOC జారీ చేయాలని క్రికెట్ సౌతాఫ్రికాను ఆదేశించింది. కోర్డు తీర్పు మేరకు షంషి ఇకపై ఏ విదేశీ లీగ్‌ల్లో అయినా ఆడుకోవచ్చు.
ఈ కేసులో క్రికెట్ సౌతాఫ్రికా కూడా తమ వాదనలు వినిపించింది. బోర్డు నిబంధనల ప్రకారం.. SA20 వేలంలో కొనుగోలు చేయబడిన ఏ ఆటగాడైనా తప్పనిసరిగా లీగ్‌లో ఆడాలి. అయితే షంషి ఈ నిబంధనను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే NOC ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కోర్టును తెలిపింది.
అయితే క్రికెట్ సౌతాఫ్రికా వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆటగాడి జీవనోపాధిని అడ్డుకోకూడదని మందలించింది. షంషి 2024 అక్టోబర్‌లోనే CSA సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయినా, సౌతాఫ్రికా తరఫున ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.


