న్యూఢిల్లీ: సంప్రదాయ టెస్టు క్రికెట్ సైతం ఆడే సత్తా తనలో ఉందని భారత బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ అన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు రాబట్టేందుకు విరాట్ కోహ్లి సలహా తీసుకున్నానని ఈ స్టార్ హైదరాబాదీ క్రికెటర్ చెప్పాడు. భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడిన 23 ఏళ్ల బ్యాటర్‌కు ఇంకా టెస్టులు ఆడే అవకాశమైతే రాలేదు. అయితే భారత టి20 జట్టులో మాత్రం పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా టి20 క్రికెట్ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపేందుకు అజేయ పోరాటం చేశాడు.
డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ మాట్లాడుతూ ‘వన్డేలు, టెస్టులు కూడా నాకు నప్పుతాయి. సంప్రదాయ ఫార్మాట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వన్డేలు ఆడేందుకు నేనెంతగానో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఒకే జట్టులో రోహిత్, విరాట్ ఉంటే ఆ జట్టులో ఆత్మవిశ్వాసం మరోస్థాయిలో ఉంటుంది. వాళ్లిద్దరికి ఎంతో అనుభవముంది. వారి పరుగుల పరిజ్ఞానం అద్భుతం. నేనైతే వీలైనప్పుడల్లా వారి సలహాలు తీసుకుంటూనే ఉంటాను.
ముఖ్యంగా ఫిట్‌నెస్‌లో కోహ్లి సూపర్. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీసేందుకు అతని చిట్కాలే పాటిస్తా’ అని అన్నాడు. హైదరాబాద్ స్టార్ బ్యాటర్ టీమిండియా తరఫున కేవలం నాలుగే వన్డేలు ఆడాడు. ఫిఫ్టీ (52) సహా 68 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా వన్డే ఆడిన అతనికి మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం లభించలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకుంటానని చెప్పాడు.


