నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.
తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..
“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ..
"ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”
అంత ఈజీ కాదు..
“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”
సరైన నిర్ణయమే..
“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”
అద్భుతంగా పుంజుకున్నాం..
“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”
షఫాలీ, కాప్ గురించి..
“షఫాలీ బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”
“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”
కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది.
టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.
చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్


