స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్-2026లో పాల్గొనే భారత జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించనుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా వరల్డ్ కప్‌నకు ఎంపికయ్యే జట్టే ఆడుతుంది.
కాగా ఫిబ్రవరి 7న మొదలయ్యే వరల్డ్ కప్‌లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాతి నుంచి తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శనను (35 మ్యాచ్‌లలో 26 విజయాలు) చూస్తే టీమ్ ఎంపికలో ఎలాంటి సంచలనాలు ఉండే అవకాశం లేదు.
కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటర్‌గా ఏడాదికి పైగా విఫలమవుతున్నా సరే... టోర్నీకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అతడి కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు. విధ్వంసకర ఓపెనర్‌గా అదరగొడుతున్న అభిషేక్ శర్మకు.. వరుసగా విఫలమవుతున్నా సరే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌నే జోడీగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక రిజర్వు ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి టాపార్డర్‌లో యశస్వి జైస్వాల్‌కు చోటు కష్టమే.
రింకూ సింగ్‌కు మొండిచేయి!
మరోవైపు.. ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్‌కు స్థానం ఇస్తే.. నయా ఫినిషర్‌గా సత్తా చాటిన రింకూ సింగ్‌కు మొండిచేయి తప్పకపోవచ్చు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. మరోవైపు.. జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా తమ వంతు సాయం అందించనున్నారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్ పంత్


