మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్ సందర్భంగా కొత్త చాంపియన్ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.
కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్ ఫైనల్‌కు చేరాయి.
ఎవరు గెలిచినా చరిత్రే
నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్ పోరులో భారత్- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది.
ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే
ఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా.. సూ రెడ్‌ఫెర్న్ థర్డ్ అంపైర్‌గా.. నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్‌గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.
వర్షం పడే అవకాశం
కాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్టు తెలిపింది.
ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్ డేన మ్యాచ్ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.
వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్: భారత్- సౌతాఫ్రికా జట్లు
భారత్
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.
సౌతాఫ్రికా
లారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్, నదినె డి క్లెర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో మలాబా, అనెరి డెర్క్‌సెన్, అనెకె బాష్, మసబట క్లాస్, సునే లూస్, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్.
చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే


