ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వోల్వార్డ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసింది. ఆమె కేవలం 115 బంతుల్లోనే తన పదివ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది. సెంచరీ పూర్తియ్యాక లారా మరింత చెలరేగిపోయింది. 47వ ఓవర్ వేసిన స్మిత్ బౌలింగ్‌లో వోల్వార్డ్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది.
మొత్తంగా 143 బంతులు ఎదుర్కొన్న లారా వోల్వార్డ్.. 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169 పరుగులు చేసింది. ఆమెతో పాటు టాజ్మిన్ బ్రిట్స్(45), కాప్(42), ట్రయాన్(33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సోఫీ ఎక్లెస్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ రెండు, నాట్ స్కీవర్ ఒక్క వికెట్ సాధించారు.
రెండో జట్టుగా రికార్డు..
కాగా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనే పాకిస్తాన్‌పై 312 పరుగులు ప్రోటీస్ సాధించింది.
అదేవిధంగా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో రెండో అత్యధిక టోటల్ నెలకొల్పిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో ఆసీస్ అగ్రస్ధానంలో ఉంది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఏకంగా 356 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు


