దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును దక్కించుకుంది. 2025, అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును (ICC Player of the Month) కైవసం చేసుకుంది.
అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది.
గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీ (169) చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ నెలలో భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. లారా సెంచరీతో మెరిసినా సౌతాఫ్రికా ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచకప్ టైటిల్ గెలవలేకపోయినా, మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అంది.
ఈ అవార్డు కోసం భారత స్టార్ బ్యాటర్, ప్రపంచకప్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ పోటీపడినప్పటికీ.. లారానే అదృష్టం వరించింది.
పురుషుల విభాగంలో ముత్తుసామి
అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికన్‌నే వరించింది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో అతను విశేషంగా రాణించాడు.
తొలి టెస్ట్‌లో 11 వికెట్లు, రెండో టెస్ట్‌లో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ అవార్డు కోసం ముత్తసామితో పాటు పాకిస్తాన్ స్పిన్నర్ నౌమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పోటీపడ్డారు.
ఐసీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన అభిమానులు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధుల ఓట్ల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించబడతాయి.
చదవండి: ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు


