నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్‌లో రిషబ్ పంత్ (Rishabh Pant), ధృవ్ జురెల్ (Dhruv Jurel) బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ధృవీకరించాడు. జురెల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడని వెల్లడించాడు.
డస్కటే ప్రకటనతో టీమిండియా తుది జట్టు కూర్పుపై క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆతర్వాతి స్థానాల్లో జురెల్, పంత్, జడేజా, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
తొలి టెస్ట్‌లో తనూ, పంత్ ఇద్దరూ బరిలోకి దిగడం ఖరారైన నేపథ్యంలో జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్ "ఫాలో ద బ్లూస్"తో మాట్లాడుతూ పంత్‌తో పోటీ ఉంటుందా అన్న అంశంపై స్పందించాడు. పంత్‌తో పోటీ ఉండదని, ఇద్దరం టీమిండియాకు ఆడుతున్నామని అన్నాడు. ఇద్దరిలో ఎవరు బాగా ఆడినా, అంతిమంగా తమ లక్ష్యం భారత్ గెలుపేనని తెలిపాడు.
పంత్ బాగా ఆడినా, నేను బాగా ఆడినా సంతోషిస్తానని అన్నాడు. ఇద్దరు బాగా ఆడితే అంతకు మించిన సంతోషం లేదని తెలిపాడు. అంతిమంగా జట్టు ఫోకస్ అంతా గెలుపుపైనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇదే సందర్భంగా సౌతాఫ్రికాతో పోటీపై కూడా స్పందించాడు. ఈ సిరీస్ హోరాహోరీగా ఉండబోతుందని అంచనా వేశాడు. ఇరు జట్లలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అన్నాడు. వారికి రబాడ, జన్సెన్ ఉంటే.. మాకు బుమ్రా, సిరాజ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు.
కాగా, పంత్ గైర్హాజరీలో టీమిండియాలోకి వచ్చిన జురెల్ అసాధారణ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల అహ్మదాబాద్ టెస్ట్‌లో వెస్టిండీస్‌పై సూపర్ సెంచరీ చేసిన అతను.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో అజేయ సెంచరీలు చేశాడు. జురెల్ ప్రస్తుత ఫామ్ టీమిండియాలో అతని స్థానాన్ని సుస్థిరం చేసేలా ఉంది.


