బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై శతకంతో కదంతొక్కిన కోహ్లి... గుజరాత్‌తో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ పోరులో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. మొదట ఢిల్లీ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి చక్కటి షాట్‌లతో అర్ధశతకంతో ఆకట్టుకోగా... రిషభ్ పంత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.
రోహిత్ ‘డకౌట్’
జైపూర్: సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (0) ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ‘గోల్డెన్ డకౌట్’ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అయినా శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ముంబై జట్టు 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలిచింది. మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ తమోర్ (93 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సర్ఫరాజ్ ఖాన్ (55; 5 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (55; 7 ఫోర్లు), షమ్స్ ములానీ (48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది.


