మహిళల టీ20 క్రికెట్‌లో మరో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లౌరా హారిస్ న్యూజిలాండ్‌లో జరుగుతున్న టి20 లీగ్‌లో ఈ ఘనత సాధించింది. కేవలం 15 బంతుల్లో ఆమె ఫిఫ్టీ బాదింది. కివీస్ లీగ్ టోర్నీ ఉమెన్ సూపర్ స్మాష్ (డబ్ల్యూఎస్‌ఎస్)లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఆదివారం కాంటర్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగింది.
అలెగ్జాండ్రాలోని మోలినెక్స్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లౌరా (15 బంతుల్లో 52; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేసింది. తద్వారా 2022లో వారి్వక్‌షైర్ తరఫున మేరి కెల్లీ చేసిన (15 బంతుల్లో ఫిఫ్టీ) రికార్డును సమం చేసింది. లౌరా వీరబాదుడుతో 146 పరుగుల లక్ష్యాన్ని 15వ ఓవర్లోనే ఛేదించిన ఒటాగో ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో గెలిచింది.
ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో నిరాశపరిచిన లౌరా.. న్యూజిలాండ్‌లో మెరుపులు మెరిపించింది. అయితే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆమెకిదే మొదటిది కాదు. ఓవరాల్ టి20 లీగ్‌లలోనే ఆరుసార్లు 50 పైచిలుకు (ఫిఫ్టీలు) పరుగులు చకచకా చేసిన ఘనత ఆమెకు ఒక్కరికే దక్కుతుంది.
మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఇంకోసారి 17 బంతుల్లో, ఇప్పుడేమో 15 బంతుల్లో ధనాధన్ అర్ధశతకాల్ని బాదింది. ప్రత్యేకించి మహిళల టి20 క్రికెట్, లీగ్‌లలో ఆమె తప్ప ఇంకెవరూ ఒకసారి మించి వేగవంతమైన అర్ధసెంచరీల్ని బాదలేకపోయారు.
చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!


