ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను (Babar Azam) వెనక్కు నెట్టి టాప్-5లోకి చేరాడు.
గత వారం ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండిన విరాట్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఘెరంగా విఫలమైన బాబర్ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. టాప్-10 మరో టీమిండియా స్టార్ ఆటగాడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు.
తాజాగా ర్యాంకింగ్స్‌లో ఇద్దరు పాక్ ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించినందుకు యువ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకొని 36వ స్థానానికి ఎగబాకాడు. అదే సౌతాఫ్రికా సిరీస్‌లో పర్వాలేదనిపించి, నిన్న శ్రీలంకతో జరిగిన వన్డేలో శతక్కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు.
పాక్‌తో సిరీస్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానానికి చేరాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ప్లేస్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. భారత ఆటగాడు అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
చదవండి: IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త


