2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు.
మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.
సురక్షితం కాదు
ఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది.
కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్‌లో తమ హోం మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్‌గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్‌గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.
ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
ఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్‌లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్


