టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కేవలం టెస్టులకే పరిమితం కానున్నాడా? వన్డే జట్టులో కూడా చోటు కోల్పోనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. న్యూజిలాండ్‌తో 2026 జనవరిలో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రిషబ్ పంత్‌పై సెలక్టర్లు వేటు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఢిల్లీ బాయ్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నప్పటికి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.
టెస్టుల్లో హిట్.. వన్డేల్లో ఫట్
ఇప్పటివరకు భారత తరపున 31 వన్డేలు ఆడిన రిషబ్.. 33.5 సగటుతో కేవలం 871 పరుగులు మాత్రమే చేశాడు. టీ20ల్లో కూడా 76 మ్యాచ్‌లు ఆడి 23.25 సగటుతో 1209 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఇప్పటికే టీ20 జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా పక్కన పెట్టేందుకు సిద్దమయ్యారంట.
పంత్ టీమిండియా తరపున చివరగా వన్డేల్లో గతేడాది ఆగస్టులో శ్రీలంకపై ఆడాడు. అప్పటి నుంచి అతడు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికి.. తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. మొత్తం మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.
2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో ఉన్నప్పటికి పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కె.ఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా మాత్రమే పంత్ ఉన్నాడు. కాగా పంత్ టెస్టు క్రికెట్‌లో మాత్రం 49 మ్యాచ్‌లు ఆడి 42.91 సగటుతో 3476 పరుగులు చేశాడు.
జట్టులోకి కిషన్..
ఇక దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తిరిగి వన్డేల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికైన కిషన్‌ను వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు సమాచారం.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఇషాన్.. అదే ఫామ్‌ను విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. కర్ణాటకతో జరిగిన తొలి మ్యాచ్‌లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్‌గా కిషన్ నిలిచాడు.
ఈ క్రమంలోనే అతడికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్టర్లు సిద్దమయ్యారు. కిషన్ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు. కిషన్‌కు వన్డేల్లో అద్బుతమైన డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక కివీస్‌తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: SA20: సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్‌లోనే?


