ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ప్రస్తుత తరం ఫీల్డర్లలో అత్యుత్తముడనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టీవ్ మైదానంలో ఏ ప్రాంతంలో ఫీల్డింగ్ చేసినా పాదరసంలా కదులుతూ, కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతూ, ప్రత్యర్ధి జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టలా ఉంటాడు. ఫార్మాట్ ఏదైనా స్టీవ్ మైదానంలో ఉన్నాడంటే జరిగేది ఇదే.
అలాంటి స్టీవ్ తాజాగా ఫీల్డింగ్‌కు సంబంధించి ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ ఫీల్డర్ రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు.
ద్రవిడ్ 301 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 210 క్యాచ్‌లు పట్టగా.. స్టీవ్ 232 ఇన్నింగ్స్‌ల్లోనే ద్రవిడ్ మార్కును దాటి 212 క్యాచ్‌లకు చేరాడు. ఇక స్టీవ్ ముందున్నది జో రూట్ మాత్రమే. ప్రస్తుతం రూట్ ఖాతాలో 214 క్యాచ్‌లు ఉన్నాయి. రూట్‌కు స్టీవ్‌కు మధ్య కేవలం రెండు క్యాచ్‌ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు (టాప్-5)..
రూట్-214
స్టీవ్ స్మిత్-212
ద్రవిడ్-210
జయవర్దనే-205
కల్లిస్-200
కోహ్లిని వెనక్కు నెట్టి..
అన్ని ఫార్మాట్ల వారీగా చూస్తే.. స్టీవ్ స్మిత్ టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించి అన్ని ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. విరాట్ ఖాతాలో 342 క్యాచ్‌లు ఉండగా.. స్టీవ్ అన్ని ఫార్మాట్ల క్యాచ్‌ల సంఖ్య 344కు చేరింది.
ఈ జాబితాలో జయవర్దనే (440) అందరి కంటే చాలా ముందున్నాడు. అతని తర్వాత పాంటింగ్ (364), రాస్ టేలర్ (354) ఉన్నారు. ఇంగ్లండ్‌తో ఇవాళ (డిసెంబర్ 26) ప్రారంభమైన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. ఆసీస్ 152, ఇంగ్లండ్ 110 పరుగులకే చాపచుట్టేశాయి. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి మూడు టెస్ట్‌లు నెగ్గిన ఆ జట్టు 3-0 క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది.


